ఇటీవల కాలంలో భర్తను భార్యా, భార్యను భర్త మోసం చేయడం ఓ సాధారణ విషయంగా మారిపోయింది. దీనివల్ల ఇద్దరి మధ్య ఉండాల్సిన నమ్మకం దెబ్బతింటుంది. అయితే ఏ బంధంలోనైనా మోసం అనేది భరించలేని బాధను మిగులుస్తుంది. ఇక భార్యాభర్తల బంధమైతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కుటుంబమే చిన్నాభిన్నం అవుతుంది. అందుకే ప్రతి అడుగూ చాలా జాగ్రత్తగా వేయాలి. అలా లేకపోతే జరిగే నష్టాలు ఎలా ఉంటాయో ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో తెలుసుకుందాం…
శ్రీలక్ష్మికి దాదాపుగా 45 ఏండ్లు ఉంటాయి. ఆమెకు 18 ఏండ్లు ఉన్నప్పుడు వాళ్ల మేనబావతో పెండ్లి జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ముఖేష్ వ్యాపారం చేస్తాడు. ఈమె ఇంట్లోనే ఉంటుంది. అయితే శ్రీలక్ష్మికి పెండ్లిలో స్ర్తీధనం కింద ఒక ఇల్లు, పది ఎకరాల పొలం, 50 తులాల బంగారం ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు డబ్బు కావాలని, బయట అప్పు చేయడం ఎందుకని అందులో ఐదు ఎకరాల పొలం అమ్మేశారు. వచ్చిన డబ్బుతో వ్యాపారం చేశారు. అందులో దివ్య అనే ఓ అమ్మాయిని భాగస్వామిగా చేర్చుకున్నారు. తర్వాత ఆమె అతని జీవితంలోకి కూడా వచ్చింది. శ్రీలక్ష్మికి ఇచ్చిన ఇంట్లో వాళ్ల అమ్మానాన్న ఉంటారు. వీళ్లకు శ్రీలక్ష్మి ఒక్కతే బిడ్డ. అందుకే వారి ఆస్తి మొత్తం కూతురికే రాసి ఇచ్చారు. బయట వ్యక్తిని అల్లుడిని చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో చూసుకుంటారో లేదో అని మేనల్లుడినే కూతురికి ఇచ్చి పెండ్లి చేశాడు. కానీ అతను ఆస్తి మొత్తం వ్యాపారం పేరుతో కొంచెం కొంచెంగా కరగదీశాడు.
ఒకప్పుడు పిల్లలు ఏం అడిగినా కాదనకుండా తెచ్చేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక డ్రెస్సు అడిగితే రెండు తెచ్చి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాప కాలేజీ ఫీజు కోసం డబ్బు అడిగితే ‘నీకెందుకు చదువు’ అంటున్నాడు. అంతేకాదు ‘నాకు ఇల్లరికం ఉండటం ఇష్టం లేదు, పిల్లలు ఎదుగుతున్నారు, మనందరికీ ఈ ఇల్లు సరిపోవడం లేదు, హైదరాబాద్‌లో మనం పెద్ద ఇల్లు తీసుకుందాం’ అంటూ మరో మూడు ఎకరాల పొలం అమ్మి ఇల్లు కొన్నాడు. ఇల్లు చాలా పెద్దగా ఉంది. కానీ శ్రీలక్ష్మి తల్లిదండ్రులు ఊరు వదిలి రాలేక అక్కడే ఉంటున్నారు. మిగిలిని ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. అందులో పండిన బియ్యమే వీరు తిని బతుకుతున్నారు. ఇప్పుడు దాన్ని కూడా అమ్మాలని చూస్తున్నాడు. దాంతో వాళ్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. అలా ఆ రెండు ఎకరాలు మాత్రమే మిగిలి వుంది.
పిల్లలిద్దరి కాలేజీ ఫీజులు 40 వేలు అవుతుంది. అందులోనే బస్సు ఫీజు కూడా ఉంటుంది. కానీ ఆరు నెలల నుండి ఫీజు కట్టడం లేదు. శ్రీలక్ష్మి అడిగితే వ్యాపారంలో నష్టం వచ్చిందని చెబుతున్నాడు. అసలు విషయం ఏమిటని తెలుసుకుంటే ముఖేష్ దివ్యతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి పాప తండ్రిని నిలదీసింది. దాంతో పాపను కొట్టాడు. కనీసం ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఇల్లు కొన్నప్పుడు దానికి కూడా డబ్బు మొత్తం చెల్లించలేదు. బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాడు. బయట అప్పులు కూడా చాలా ఉన్నాయి. బ్యాంక్ లోన్ కూడా శ్రీలక్ష్మి పేరుతోనే ఉంది. కానీ ఆ విషయం శ్రీలక్ష్మికి తెలియదు. భర్తను గుడ్డిగా నమ్మేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసింది. ఇటీవల శ్రీలక్ష్మికి బ్యాంక్ నుండి నోటీసు కూడా వచ్చింది.
పొలం అమ్మగా వచ్చిన రెండు కోట్లతో దివ్యకు ఇల్లు కొనిచ్చి ఈ ఇంటిని లోన్ పెట్టి తీసుకున్నాడని శ్రీలక్ష్మికి తెలిసింది. ఇవన్నీ భార్య అడుగుతుందని ముఖేష్ అసలు ఇంటికి రావడమే మానేశాడు. దివ్య దగ్గరే ఉంటున్నాడు. వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక శ్రీలక్ష్మి సలహా కోసం ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది.
‘మేడమ్ నా బంగారం మొత్తం ఆయనే తీసుకున్నాడు. వేరే ఆమె కోసం మమ్మల్ని రోడ్డున పడేశాడు. ఇప్పుడు మాకు ఎలాంటి ఆధారమూ లేదు. మీరే మాకు ఓ దారి చూపించండీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మేము వెంటనే ముఖేష్‌కు ఫోన్ చేసి రమ్మన్నాము. కానీ అతను ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. అలా నెల రోజులు గడిపాడు. దాంతో మేము ‘అసలు మీకు వచ్చి మాట్లాడే ఉద్దేశం ఉందా, లేదా? తప్పు చేయనప్పుడు రావడానికి మీకు సమస్య ఏంటీ?’ అని గట్టిగా అడిగాము. దాంతో అతను వెంటనే ఐద్వా ఆఫీసుకు వచ్చి… ‘నేను శ్రీలక్ష్మి డబ్బు, బంగారం తీసుకొని ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఇల్లు కొన్నాను. కరోనా తర్వాత వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. బాగా అప్పులు అయ్యాయి. ఇంటి మీద లోన్ తీసుకోవల్సి వచ్చింది. దివ్యతో సంబంధం ఉందని పిల్లల ముందు తలదించుకునే పరిస్థికి నన్ను తీసుకొచ్చింది.
వ్యాపార అవసరాల రీత్యా కొంత మందిని కలవాల్సి వస్తుంది. కొంత మందితో రిలేషన్ పెంచుకోవాలి. దాన్ని కూడా అపార్థం చేసుకుంటే ఎలా? ఇప్పుడు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా పరువంతా తీసేసింది. అందుకే నేను ఆమెతో ఉండడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి మేము ‘అయితే మీకు దివ్య అనే ఆమెతో సంబంధం ఉందా’ అని అడిగాము. ఆమెతో పరిచయం ఉంది కానీ నేను ఆమెతో కలిసి ఉండడం లేదు. ఆమెకూ భర్తా పిల్లలు ఉన్నారు. కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె లేకుండా నేను ఉండలేను. శ్రీలక్ష్మి ఇది అర్థం చేసుకొని ఉంటే ఇంటి లోన్ కడతాను, పిల్లల ఫీజులు కూడా కడతాను లేదంటే లేదు’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దాంతో శ్రీలక్ష్మి ‘ఇలాంటి వాడితో నేను ఎలా కలిసి బతకాలి. నా బతుకు నేను బతుకుతాను. నా పిల్లల్ని నేనే చదివించుకుంటాను’ అంది. అయితే శ్రీలక్ష్మి కూతురు మాత్రం ‘వేరే వాళ్ల కోసం మమ్మల్ని వద్దనుకుంటున్న వ్యక్తికి ఎలాంటి శిక్షా లేకుండా అలా ఎలా వదిలేస్తాం. ఈయన వల్ల మేము మానసికంగా చాలా బాధపడుతున్నాము. ఆయనకు కూడా కచ్చితంగా శిక్ష పడాల్సిందే’ అంది.
మేము మాట్లాడుతూ ‘మీపై నమ్మకంతో శ్రీలక్ష్మి తల్లిదండ్రులు వాళ్ల ఆస్తి మొత్తం మీ చేతిలో పెట్టారు. కానీ మీరు ఇలా చేస్తున్నారు. కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు మీకు ఎలాంటి ఉద్యోగం లేదు, వ్యాపారం కూడా లేదు. ఆదాయం లేని మిమ్మల్ని ఆమె ఎన్ని రోజులు భరిస్తుందో ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు భార్యా పిల్లల్ని వదిలేస్తే రేపు మీకు జీవితమే లేకుండా పోతుంది’ అని చెప్పాము. కానీ ఇదంతా అతను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. కూతురి సహకారంతో శ్రీలక్ష్మి కోర్టులో కేసు ఫైల్ చేసింది. అతని నుండి రావల్సిన నష్టపరిహారం కోసం గట్టిగా పోరాడుతుంది. ఆమెకు ఐద్వా కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చాము.
శ్రీలక్ష్మికి ఇచ్చిన ఇంట్లో వాళ్ల అమ్మానాన్న ఉంటారు. వీళ్లకు శ్రీలక్ష్మి ఒక్కతే బిడ్డ. అందుకే వారి ఆస్తి మొత్తం కూతురికే రాసి ఇచ్చారు. బయట వ్యక్తిని అల్లుడిని చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో చూసుకుంటారో లేదా అని మేనల్లుడినే కూతురికి ఇచ్చి పెండ్లి చేశాడు. కానీ అతను ఆస్తి మొత్తం వ్యాపారం పేరుతో కొంచెం కొంచెంగా కరగదీశాడు.
ఇల్లు కొన్నప్పుడు దానికి కూడా డబ్బు మొత్తం చెల్లించలేదు. బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాడు. బయట అప్పులు కూడా చాలా ఉన్నాయి. బ్యాంక్ లోన్ కూడా శ్రీలక్ష్మి పేరుతోనే ఉంది. కానీ ఆ విషయం శ్రీలక్ష్మికి తెలియదు. భర్తను గుడ్డిగా నమ్మేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసింది. ఇటీవల శ్రీలక్ష్మికి బ్యాంక్ నుండి
నోటీసు కూడా
వచ్చింది.



