Saturday, August 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో బీజేపీ విధానాలపై పోరాటం

విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో బీజేపీ విధానాలపై పోరాటం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది
విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. సుధా భాస్కర్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో “2025 విద్యుత్ సవరణ చట్టం – ప్రజలపై భారం” అంశంపై సెమినార్

నవతెలంగాణ-సంగారెడ్డి
విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందనీ, ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేయడం వల్ల సామాన్య ప్రజలు, వినియోగదారులపై అదనపు భారం పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. సుధా భాస్కర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కేవల్‌ ‌కిషన్‌ ‌భవన్‌‌లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ‘2025 విద్యుత్ సవరణ చట్టం – ప్రజలపై భారం” అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.సుధా భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యుత్ సంస్కరణల చట్టాల ద్వారా ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వినియోగదారులపై భారం మోపే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలన్నారు.

విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో ప్రజలు సాగించిన నాటి పోరాటం ప్రయివేటీకరణను తిప్పికొట్టిందనీ, అనాటి ప్రభుత్వం మెడలు వంచిందన్నారు. ఆ పోరాటంలో పోలీసు కాల్పులకు బలై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగం ఏనాటికి మరవలేనిదన్నారు. విద్యుత్ ప్రయివేటీకరణ అయితే బయట పరిస్థితులను బట్టి విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ చర్యలతో విద్యుత్ రంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం సిద్ధపడిందన్నారు. ఈ చర్యతో పారిశ్రామిక అభివృద్ధి కూడా దెబ్బతిని ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. రాష్ట్రాల చేతుల్లోవున్న విద్యుత్ రంగాన్ని కేంద్రం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనుకొంటుందన్నారు. దీని అమలు కోసం రాష్ట్రాలను లొంగదీసుకుంటున్నదని విమర్శించారు. దేశానికి ప్రాణవాయువు లాంటి విద్యుత్ మీద బడా కార్పొరేట్ శక్తులు బీజేపీ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా విద్యుత్ వినియోగదారులు, రైతాంగం, కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు సమస్త ప్రజానికం పెద్దఎత్తున తిరగబడి మన భావితరాలను, మన దేశ భవిష్యత్తును కాపాడుకోవలన్నారు.

విద్యుత్తు పోరాట అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు కాకుండా విశాల ఐక్య ఉద్యమానికి సిద్ధమవ్వాలనీ పిలుపునిచ్చారు. ముంచుకొస్తున్న విద్యుత్ సంస్కరణల ముప్పును అడ్డుకుని విద్యుత్తును ప్రజాసేవగా, ప్రజల హక్కుగా కాపాడుకోవడమే బషీర్‌బాగ్ అమరవీరులకు మనమందించే నిజమైన నివాళులన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ కుట్రలో పడిపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, అతిమేల మానిక్, జి. సాయిలు, ఎం. నర్సింహులు జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, యాదగిరి, విద్యాసాగర్, కృష్ణ, నాయకులు రాజయ్య, అశోక్, రమేష్ గౌడ్, మహేష్, బాలరాజు, బాగారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

నాటి పోరాటంతో విద్యుత్ చార్జీల పెంపు మాటెత్తని ప్రభుత్వాలు : జయరాజు, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడంతో పాటు కాల్పులు జరిపిందనీ, నాటి పోరాటంతో విద్యుత్ ఛార్జీల పెంపు అనే మాటను ప్రభుత్వాలు ఎత్తడంలేదని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి. జయరాజు అన్నారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి మృతి చెందారని తెలిపారు. అమరవీరుల త్యాగాలతో కూడిన ప్రజా పోరాటం ఫలితంగా అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. నాటి పోరాట ప్రభావంతోనే ఆ తర్వాతి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు సాహసించలేదని పేర్కొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -