Saturday, August 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకృష్ణా, గోదావరి జలాల వినియోగంపై 
శ్వేతపత్రం విడుదల చేయాలి

కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై 
శ్వేతపత్రం విడుదల చేయాలి

- Advertisement -

బ్రిజేష్ కుమార్ నివేదికను బయటపెట్టాలి
సాగర్ ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపకపోతే ఉద్యమం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు నీటిని ఉపయోగించుకునే విధానంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ నాయకత్వంలో ఇచ్చిన నివేదికను బయట పెట్టకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్రాల మధ్య జల తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం నాన్చుడు ధోరణిని విడనాడాలన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపకపోతే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింద‌న్నారు. ఇటీవల కురిసిన వర్షపు జల్లులతో మెట్ట పంటలకు కొంత లబ్ది జరిగినప్పటికీ ఎక్కువ శాతం నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు. బోర్లు, బావుల కింద 50 శాతానికి పైగా వరితో సహా ఇతర పంటలు సాగు చేశారన్నారు.

వాటిని కాపాడాలంటే ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలు తగ్గకుండా చూడాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకంలో నికర జలాల పంపకం కూడా జరగాలని ఆనాటి ఒప్పందం అని, రాష్ట్ర విభజన జరిగి పండెన్నరేండ్లవుతున్నప్పటికీ కేంద్రం సాచివేత ధోరణిని ప్రదర్శిస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని యోచిస్తోం దని, ఇది సరికాదని అన్నారు. సీడబ్ల్యూసీలో రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. గోదావరి నది జలాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎంతో సంప్రదించి నీటి పంపకాలు జరిగేలా చూడాలని కోరారు. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క లిఫ్ట్ తోనూ ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు నీరు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని విమర్శించారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా రైతుల కోసం పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, శ్రీను, సీఐటీయూ నాయకులు రామ్మూర్తి, పట్టణ కార్యదర్శి భావండ్ల పాండు, రైతు సంఘం నాయకులు రాంరెడ్డి, గిరిజన సంఘం నాయకులు నాగేశ్వర్‌‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -