Saturday, August 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌‌పై రైతులకు అవగాహన కల్పించాలి

కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌‌పై రైతులకు అవగాహన కల్పించాలి

- Advertisement -

యాంత్రీకరణ పథకం నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకే
కాంప్లెక్‌ ఎరువులకు కూడా సబ్సిడీ కోరుతాం
ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణలో వేగం పెంచాలి : సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్‌ ‌యాప్‌‌పై రైతులకు మరింత అవగాహన కల్పించాలనీ, ఆ యాప్‌‌లో వచ్చే సమస్యలపై కేంద్ర అధికారులతో మాట్లాడి ఏరోజుకారోజు పరిష్కరించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యాంత్రీకరణ పథకంలో ఇచ్చే పనిముట్లను ఖరారు చేశామనీ, ఈసారి సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. కాంప్లెక్స్ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో వేగం పెంచాలనీ, రైతులకు రెండు మూడు రోజుల్లోనే ఆయిల్‌పామ్‌ మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ పథకంలో పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌మెంట్‌ ప్రక్రియను హాకా అధికారులు పరిశీలిస్తున్నార తెలిపారు. నాణ్యత, ధర, రైతులకు అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంప్యానెల్‌ లిస్టును త్వరగా ఖరారు చేయాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఇబ్బందుల్లేవని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా 2.79, డీఏపీ 0.33, కాంప్లెక్స్‌ ఎరువులు 2.25, ఎంఓపీ 0.31, ఎస్‌ఎస్‌పీ 0.20 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర యూరియా యాప్‌ ద్వారా 33.37 లక్షల మంది రైతులు 1.38 కోట్ల యూరియా సంచులను బుక్‌ చేసుకోగా, 1.24 కోట్ల సంచులను కొనుగోలు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా 10.17 లక్షల మంది రైతులు 42.34 లక్షల సంచులను బుక్‌ చేసుకుని, 28.39 లక్షల సంచులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్ని ఎరువులను ప్రోత్సహించేలా సబ్సిడీ విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. యూరియా పంటలను రక్షించే ఎరువు కాదు.. భక్షించే ఎరువు అని వ్యాఖ్యానించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటలకు అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా అందించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలోని 2600 రైతు వేదికలపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ సంస్థగా ఉన్న హాకా.. రెడ్కో కమిషనర్‌తో సమన్వయం చేసుకుని త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలనీ, మూడు నెలల్లో ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలని హాకా ఎమ్‌‌డీకి సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేషన్ స్పెషల్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా, హాకా ఎమ్‌‌డీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -