తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ వేయాలి
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
నవతెలంగాణ – వనపర్తి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్స్ వేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కార్యాలయం లో శుక్రవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చేప్పారని గుర్తుచేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ తో పాటు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయడం లేదన్నారు. సమగ్రమైన వివరాలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను తక్షణమే వేయాలన్నారు. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వాలన్నారు.
స్వయం ఉపాధి రుణాలిస్తామని రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంలేదన్నారు. దరఖాస్తులకే పరిమితం కాకుండా, కాలయాపన చేయకుండా అర్హులైన నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 60 లక్షల పైగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో పోరాటాలు తప్పవన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీ.రాఘవేంద్ర, గడికొప్పుల మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్, రాజశేఖర్, మహేష్ లు పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



