అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములను హైకోర్టుకివ్వొద్దు

– 55 జీవోను వెంటనే రద్దు చేయాలి
– యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థుల ఆందోళన
– వరంగల్‌లోనూ నిరసన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, 55 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. గురువారం వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయిస్తూ 55 జీవో విడుదల చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గురువారం పరిపాలన భవనం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ప్రభుత్వం కేటాయించడం దారుణమన్నారు. ఈ యూనివర్సిటీలో 300కు పైగా పక్షి జాతులు, 90కి పైగా వివిధ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, ఇప్పుడు ఈ స్థలం హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తే వాటి ఉనికికే ప్రమాదం అన్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ యూనివర్సిటీ భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే 55 జీవోను వెనక్కి తీసుకొని, హైకోర్టుకి మరో చోట భూమి కేటాయించాని డిమాండ్‌ చేశారు. జీవోను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనకు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
వరంగల్‌లోనూ ఆందోళన
హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన వంద ఎకరాలను రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడాన్ని వ్యవసాయ కళాశాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవో 55ను రద్దు చేయాలని వరంగల్‌ ఆరేపల్లిలోని వ్యవసాయ కళాశాల విద్యార్థు లు నిరసన ప్రదర్శన చేశారు. వ్యవసాయ పరిశోధనలకు విఘాతం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love