14 నుంచి రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

– పోస్టర్‌ ఆవిష్కరించిన కాంగ్రెస్‌ నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఈనెల 14 మణిపూర్‌ నుంచి ప్రారంభమవుతుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్‌ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేష్‌కుమార్‌గౌడ్‌, నిజాముద్దీన్‌తో కలిసి యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. న్యారు యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై… ముంబాయిలో ముగుస్తుందన్నారు. మొత్తంగా 6,700 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక ఉపాధి కరువైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ పాలనలో పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, సామాన్య ప్రజలు బాధలు పడుతున్నారని చెప్పారు. మోడీపాలనలో సామాన్య ప్రజలు బతకడమే గగనమై పోయిందని చెప్పారు. కిసాన్‌, దళిత, ఆదివాసీ, అల్పసంఖ్యాక వర్గాల మీద దాడులు పెరిగాయన్నారు. మణిపూర్‌లో చర్చి, ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగికదాడులు కొనసాగుతున్నా…బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులు, సంస్థలపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగించి భయాందోళనకు గురి చేస్తున్నదని విమర్శించారు. క్రీడాకారులపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగికదాడులకు పాల్పడినట్టు ఆధారాలతోసహా బయటపెట్టినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Spread the love