– వారి పూర్తి మద్దతు మనకు దక్కలేదు…
– దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
– పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసుంటే గెలిచేవాళ్లం
– మహబూబాబాద్ సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజనులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతోపాటు పోడు పట్టాల పంపిణీ, తండాలను పంచాయతీలుగా చేయటం తదితర అనేక కార్యక్రమాలను చేపట్టామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయినా ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల పూర్తి మద్దతు బీఆర్‌ఎస్‌కు దక్కలేదనీ, ఈ అంశంపై లోతుగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్ ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. గత పదేండ్ల కాలంలో ప్రజోపయోగకరమైన అనేక పనులను తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. అయితే పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా…ఏనాడూ ప్రజలను లైన్లలో నిలబెట్టలేదన్నారు. తాము జనం సౌకర్యమే చూశాం తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారమూ ఆశించలేదని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ దాకా బీఆర్‌ఎస్‌కు బలమైన నాయకత్వముందని అన్నారు. ఇప్పుడు కూడా శాసనసభలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని వివరించారు. అన్నింటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు తమ పార్టీకి ఉన్నారనీ, అందువల్ల ఎవరూ నిరుత్సాహ పడకుండా మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
నేడు భువనగిరిపై సమీక్ష
పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరి లోక్‌సభ స్థానంపై శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోపాటు తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మొదటిదఫాలో చేపట్టిన ఈ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజులపాటు విరామమిచ్చి ఈ నెల 16న తిరిగి సమీక్షలు నిర్వహించనున్నారు.