– మృతుల కుటుంబాలకు పరామర్శ.. యువతకు వాలీబాల్ ల పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న పలువురికి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. కేశప్పగూడెం గ్రామంలో యువతకు వాలీబాల్లను పంపిణీ చేశారు.
మండలంలోని కేశప్పగూడెం గ్రామానికి చెందిన మల్లం నాగరాజు ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం గ్రామంలోని యువతకు వాలీబాల్లను పంపిణీ చేసి క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లేటు శింగలదేవి పెద్దసత్యనారాయణ సతీమణి వెంకటరమణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నారాయణపురం గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైన టీఆర్ఎస్ నాయకుడు పులగడప చిలగారావును ఆయన నివాసంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదే గ్రామానికి చెందిన నులకని శ్రీనివాసరావు మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డబ్బాతోగు గ్రామంలో ఇటీవల మృతి చెందిన సోడియం వీరభద్రం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గుమ్మడవల్లి గ్రామంలో కంటి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న షేక్ నాసర్ వాలి సతీమణిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానని తెలిపారు. అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, మాజీ జెడ్పీటీసీ అంకితం మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, జుజ్జూరపు శ్రీరామ్మూర్తి, సత్యవరపు సంపూర్ణ, శెట్టిపల్లి రఘురాం, తగరం జగన్నాథం, నార్లపాటి చిన్నబ్బాయి, తగరం హరి తదితరులు పాల్గొన్నారు.



