Saturday, August 29, 2026
E-PAPER
Homeఖమ్మంజీసీసీ హమాలీల వేతన ఒప్పందం వెంటనే చేపట్టాలి

జీసీసీ హమాలీల వేతన ఒప్పందం వెంటనే చేపట్టాలి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరల దుకాణాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను చేరవేయడంలో జీసీసీ హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు.  అయితే హమాలీలకు సకాలంలో వేతన ఒప్పందం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. శనివారం జీసీసీ కార్యాలయంలో జీసీసీ హమాలీల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. జీసీసీ హమాలీల ఎగుమతి, దిగుమతి రేట్లకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్‌ తో ముగిసిందన్నారు. ఈ ఏడాది జనవరిలో సంబంధిత సివిల్‌ సప్లై అధికారులు, మంత్రి, హమాలీ యూనియన్‌ నాయకులతో చర్చించి నూతన వేతన ఒప్పందం చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒప్పందం జరగలేదన్నారు.

నూతన వేతన ఒప్పందం చేయాలని పలుమార్లు సివిల్‌ సప్లై అధికారులకు, సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన కూడా తెలిపామని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ఎగుమతి, దిగుమతి రేటు రూ.29 నుంచి రూ.40 కు పెంచి నూతన ఒప్పందం కుదుర్చుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గత ఐదు వేతన ఒప్పందాల్లో ప్రభుత్వ అధికారులు అంగీకరించిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలను జీసీసీ హమాలీలకు వర్తింపజేసి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ మురహరి రఘు, హమాలీ యూనియన్‌ నాయకులు భోగ్యం సత్యం, నరసయ్య, వీర్రాజు, వెంకట్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -