నవతెలంగాణ – మల్హర్ రావు
మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్‌మనన్ పెంతియా శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పరిపాలన, టూరిజం, ఐటీ/ ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్యా తదితర రంగాల్లో తెలంగాణ–మారిషస్’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలు, కార్యాచరణపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. ఆనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ‘తెలంగాణ’ను తమ దేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోందని, ఈ సందర్భంగా మారిషస్ మంత్రి లుచ్‌మనన్ పెంతియా పేర్కొన్నారు.
మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆధునిక పరిపాలనా విధానాలపై వారికి శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. అలాగే రాష్ట్రంలోని ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ విద్యా సంస్థలతోనూ పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మారిషస్ కు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డిసెంబర్ 7,8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026″లో పాల్గొనాలని మంత్రి లుచ్‌మనన్ పెంతియాను ఆహ్వానించారు. సమావేశంలో సెక్రటరీ ఫర్ పబ్లిక్ సర్వీస్ దేవేంద్ర గోపాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ (ఏఐపీఎస్ఐ) బోర్డ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ నికోలస్ రాగోడూ, ఏఐపీఎస్ఐ రిజిస్ట్రార్ డా.రమేష్ దుర్బరీ, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ మాధవ్ ఆర్.సుల్ఫులే, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య,ఐటీఈఅండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.



