Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలభివృద్ధికి మంత్రి శ్రీహరి ప్రత్యేక కార్యాచరణ

గ్రామాలభివృద్ధికి మంత్రి శ్రీహరి ప్రత్యేక కార్యాచరణ

- Advertisement -

ప్రతి గ్రామంపై 30 నిమిషాల సమీక్ష.. సమస్యల పరిష్కారంపై దృష్టి
ఎస్‌ఐఆర్‌తో పాటు మౌలిక వసతులపై గ్రామాల వారీగా ఆరా
నవతెలంగాణ-మక్తల్ 

మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి గ్రామానికి సమాన ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో మాగనూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా చేపట్టిన, కొనసాగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా సమీక్షించారు.

ప్రతి గ్రామానికి సుమారు 30 నిమిషాల సమయం కేటాయించి, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి నాయకులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సేకరించారు. ముఖ్యంగా SIR అంశంపై గ్రామాల వారీగా వివరాలు తెలుసుకుని, అవసరమైన చర్యలపై చర్చించారు.

గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై మంత్రి ఆరా తీశారు. ఏ గ్రామంలో ఏ పని అత్యవసరమో గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడాలని మంత్రి శ్రీహరి నాయకులకు సూచించారు. గ్రామస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ఒక్కో గ్రామానికి ప్రత్యేక సమయం కేటాయించి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా గ్రామాభివృద్ధిపై మంత్రి శ్రీహరి తనకున్న ప్రత్యేక దృష్టిని చాటుకున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో మాగనూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -