నవతెలంగాణ-సత్తుపల్లి
స్థానిక సిద్ధారం రోడ్డులోని ‘మిరాకిల్ మైండ్స్ – ది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగు భాషకు వారు అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వేసిన రకరకాల వేషధారణలు, ఒలింపిక్ రింగుల ఆవిష్కరణ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు భాషా విశిష్టతను చాటుతూ విద్యార్థులకు పద్య పఠనం, వ్యాసరచన, వక్తృత్వ (డిబేట్) పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందించి అభినందించింది. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ మాట్లాడుతూ… మాతృభాష మన ఆత్మ వంటిదని, భాషను, క్రీడలను రెండింటినీ సమానంగా గౌరవించాలని అన్నారు. క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణను, పట్టుదలను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఆయన ప్రిన్సిపాల్ రత్నాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.



