Saturday, August 29, 2026
E-PAPER
Homeఖమ్మం'సాయిస్ఫూర్తి'లో ఫస్టియర్ విద్యార్థులకు అట్టహాసంగా ఓరియెంటేషన్ ప్రోగ్రాం 

‘సాయిస్ఫూర్తి’లో ఫస్టియర్ విద్యార్థులకు అట్టహాసంగా ఓరియెంటేషన్ ప్రోగ్రాం 

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి ​మండలం గంగారంలోని సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్-2026, కౌన్సిలింగ్, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ఇంజనీరింగ్, ఎంబీఏలలో అడ్మిషన్లు పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు శనివారం ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

​కార్యక్రమంలో బండి అన్విద స్వాగతోపన్యాసం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానమే విద్యార్థులకు గొప్ప బలమని, నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులను విజయవంతమైన గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి వర్చువల్ సందేశాన్ని అందిస్తూ, తమ కళాశాల విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది హెటెరో స్పాన్సర్షిప్ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఫీజు మినహాయింపు లభించిందని, ఈ నాలుగు సంవత్సరాల విద్యా ప్రయాణం వారి జీవితంలో చిరస్మరణీయంగా నిలవాలని ఆకాంక్షించారు.

​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ… విద్య అంటే కేవలం మార్కులు, డిగ్రీలు మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, విలువలు పెంపొందించుకోవడమేనని ఆమె అన్నారు.  అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ… విద్యార్థులు పెద్ద కలలు కని కష్టపడి చదవాలన్నారు.  వైఫల్యాలకు భయపడకుండా తల్లిదండ్రులు, సంస్థ, దేశానికి మంచి పేరు తేవా లని కోరారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు.

​కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 90% సీట్ల భర్తీతో తమ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచిందని, యాజమాన్యంపై నమ్మకంతో చేరిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

​సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ ఎస్కే మీరాసాహెబ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ కొండా రవికుమార్, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ టి. శేషా సాయిశ్రీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పాముల శేఖర్ బాబు విద్యార్థులకు అకాడమిక్ ప్రాసెస్, సిలబస్,  టైమ్‌టేబుల్ విధానాలపై అవగాహన కల్పించారు. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్న ఈ వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, స్కిట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -