ప్రియమైన వేణు గీతికకు
నాన్నా ఎలా ఉన్నావు, మూడు రోజులు సెలవులొచ్చాయని చెప్పావు. హాయిగా విశ్రాంతి తీసుకో. నువ్వు చేసే ప్రయాణానికి విశ్రాంతి చాలా అవసరం. ఇక ఇక్కడ నాకు తీరుబడి లేకుండా పోయింది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, మన సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. ఇవి కాక వైజాగ్ ప్రయాణం కూడా ఉంది. ఊపిరాడటం లేదు. సరే నాన్నా! కిందటి ఉత్తరంలో పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాను కదా! ఈ ఉత్తరంలో ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలో చెప్తాను. నా చిన్నతనంలో ఇంట్లో పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు ‘ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండు, అప్పుడే నీ మీద గౌరవం, నమ్మకం ఏర్పడుతుంది’ అని. చిన్నప్పుడు నాకు అంత అవగాహన లేకపోయినా ఇచ్చిన మాటకు మాత్రం కట్టుబడి ఉండటం అలవాటయింది. ఎప్పుడైనా సరే, ఎవరైనా సాయం కోరి నీ దగ్గరకు వస్తే బాగా ఆలోచించి మాట ఇవ్వు. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టిబడక పోతే ఆ ప్రభావం మన వ్యక్తిత్వంపై చూపడమే కాక, నలుగురిలో అవహేళనలు ఎదుర్కోవలసి వస్తుంది. నాకు తెలిసిన వారిని ఒకసారి ఏదో సాయం అడిగాను. వారు నమ్మకంగా చెప్పడంతో సాయం చేస్తారని ఎంతో ఆశ పెట్టుకున్నాను. కానీ రోజులు, నెలలు గడుస్తున్నా వారి నుండి స్పందన లేదు. ఇక నేను ఉండబట్టలేక అడిగితే ‘ఆరోజు ఏదో మాట వరసకు చేస్తామన్నాము, నిజంగా మా మీద నమ్మకం పెట్టుకుంటే ఎలా?’ అన్నారు.
ఒక్కసారి వాళ్ళ మీద నాకు విరక్తి కలిగింది. అప్పటి నుండి ఆ కుటుంబంలోని ఎవరిపైనా నాకు సదభిప్రాయం లేదు. పోనీ చిన్న పిల్లలు, వారికి బాధ్యత తెలియదు అనుకోవడానికి లేదు. ఇంట్లో అందరూ పెద్ద వయసు వారే. అందుకే మనం ఇచ్చేమాట, చెప్పేమాట కచ్చితంగా ఉండాలి. అలా ఉండటం వల్ల సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడమే కాక, నీ పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుంది. ఏదైనా పని చేయలేకపోయినప్పుడు లేదా కుదరనప్పుడు ఎదుటి వారికి పరిస్థితి వివరించి ‘క్షమించండి నా ప్రయత్నం నేను చేసాను, మీరు అడిగిన సాయం చేయలేకపోతున్నాను’ అని వారికి చెప్పేయాలి. అవతలి వారికి ఆ పని ఎంతో ముఖ్యమైనది కావొచ్చు, కనుక వారిని ఎక్కువ రోజులు నిరీక్షణలో పెట్టక విషయం చెప్పేయాలి. నేను ఎప్పుడూ ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉంటానో, నువ్వు కూడా అలాగే ఉంటావు. చాలా నిక్కచ్చిగా ఉండటమే కాక, ఎదుటి వారికి ఆశ కల్పించి ఇబ్బంది పెట్టవు. అది నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
నోటి మాట నీటి మీద రాత కాకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని. ఎవరు నా సాయం కోరినా చేయగలిగింది తప్పక చేస్తాను అని చెప్తా. అనుమానం ఉన్నప్పుడు ప్రయత్నిస్తా అని చెప్తా, అందుకు సమయాన్ని అడుగుతా, ఆ సమయంలో నా ప్రయత్నం ఫలిస్తే సరేసరి, లేకుంటే వాళ్లకు చెప్పేస్తా క్షమించండి, ప్రయత్నించాను కానీ అయ్యేట్లు లేదు అని. చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా ఇలాంటి విషయాలు చెప్పాలి. మాట ఇవ్వడం అంటే ఓ బాధ్యత అని పిల్లలకు తెలియ చేయాలి. ఏ విషయంలో అయినా సరే, మాట చాలా చాలా విలువైనది నాన్నా! ఉంటాను. నాకు వేరే పనుంది. బయటకు వెళ్ళాలి.
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



