ఆరు నెలల యుద్ధంలో ఏ ఒక్క లక్ష్యాన్నీ చేరుకోని అమెరికా
పీడకలగా ట్రంప్ ‘విహార యాత్ర’.. మధ్యప్రాచ్యం ఆవలకు విస్తరించిన పోరు
వాషింగ్టన్ : ఇరాన్‌పై ఫిబ్రవరి చివరలో యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని ఓ ‘విహార యాత్ర’గా అభివర్ణించి, కొన్ని వారాల్లోనే ముగిసిపోతుందని చెప్పారు. కానీ ఆరు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆ పోరు ఓ పీడకలగా మారింది. ఇరాన్లో, మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న లక్షలాది మందికే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది వినియోగదారులకు విపత్తుగా పరిణమించింది. అయినప్పటికీ ట్రంప్ యుద్ధ లక్ష్యాలేవీ నెరవేరలేదు. ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని, అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలని, అణు లక్ష్యాలను టెహ్రాన్ వదులు కోవాలని తొలుత డిమాండ్ చేసిన ట్రంప్… ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తెరవాలని, ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేకులు వేయాలని అంటున్నారు. అయితే వీటలో ఏవీ నెరవేరలేదు. అమెరికా – ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని దాటి చాలా దూరం వ్యాపించింది. ప్రపంచ భద్రతను ప్రభావితం చేస్తోంది. అమెరికా ప్రతిష్టను దిగజారుస్తోంది. దాని ప్రత్యర్థులు తమ ప్రభావాన్ని విస్తరించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. తనకుతానుగా సృష్టించుకున్న సంక్షోభం నుంచి బయటపడడానికి ట్రంప్ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. యుద్ధం అత్యంత కీలకమైన భౌగోళిక, రాజకీయ, భద్రతా ప్రభావాలు మధ్యప్రాచ్యానికి ఆవల కూడా కన్పిస్తున్నాయి. దక్షిణ కొరియాతో వార్షిక సైనిక విన్యాసాలను అమెరికా కుదించుకుంది. పశ్చిమ పసిఫిక్‌లో ఉన్న ఏకైక యుద్ధ విమాన వాహక నౌకను వెనక్కి రప్పించింది. రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే వ్యవస్థల తయారీకి సంబంధించిన లైసెన్సును ఉక్రెయిన్‌కు ఇవ్వడం లేదు. ఇవన్నీ యుద్ధ ప్రభావాలే.
రష్యాకు పరోక్ష సాయం
అమెరికా – ఇజ్రాయిల్ దాడులపై మండిపడిన ఇరాన్ తీవ్రమైన ప్రతీకారంతో రగిలిపోయింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా, దాని మిత్రదేశాల స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, ఇతర క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా, దాని మిత్రదేశాల వద్ద ఉన్న ఆయుధ నిల్వలు తరిగిపోయాయి. ఉక్రెయిన్‌కు అందజేసేందుకు ఉద్దేశించిన కొంత మందుగుండు సామగ్రిని కూడా దారి మళ్లించారు. రష్యా నుంచి దూసుకొస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే వ్యవస్థలు ఉక్రెయిన్ వద్ద దాదాపుగా నిండుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తింది. రష్యాపై ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక ఒత్తిడి ప్రభావం బలహీనపడింది. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడంతో రష్యా చమురు ఎగుమతులపై విధించిన కొన్ని ఆంక్షలను ట్రంప్ ఎత్తివేశారు. దీంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికి రష్యాకు అమెరికా పరోక్షంగా సాయపడినట్లు అయింది. అంతేకాదు… చమురు, గ్యాస్, ఎరువుల వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అడ్డంకుల కారణంగా రష్యా కొత్తగా వినియోగదారులను సంపాదించగలిగింది.
దక్షిణ కొరియాతో సంబంధాలకు విఘాతం
దక్షిణ కొరియాతో అమెరికాకు చాలా కాలంగా సైనిక సంబంధాలు ఉన్నాయి. దక్షిణ కొరియాలో 28,500 మంది సైనికులు తిష్ట వేసి ఉన్నారు. అయితే ఇరాన్‌పై తాను చేస్తున్న యుద్ధానికి సహకరించడానికి దక్షిణ కొరియా అంగీకరించకపోవడంతో ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సంయుక్త సైనిక విన్యాసాలను కుదించుకోవాలని ఆయన రక్షణ శాఖను ఆదేశించారు.
దీంతో ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమేనని ట్రంప్ సంకేతాలు కూడా ఇచ్చారు. ట్రంప్ నిర్ణయానికి ప్రతిగా…సెప్టెంబరులో జరగాల్సిన యాంఫిబియస్ ల్యాండింగ్ విన్యాసాలను దక్షిణ కొరియా రద్దు చేసుకుంది.
మిత్రదేశాల్లో కలవరం
యూఎస్ఎస్ అబ్రహం లింకన్ స్థానంలో యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్‌ను అరేబియా సముద్రానికి పంపడంతో ఇప్పుడు పసిఫిక్‌లో అవసరానికి అమెరికాకు ఒక్క యుద్ధ విమాన వాహక నౌక కూడా లేకుండా పోయింది. దీంతో మిత్రదేశాలలో ఆందోళన వ్యక్తమ వుతోంది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో జీజింగ్ నియంత్రణలో ఉన్న స్కార్బరో షోల్ వంటి ప్రాంతాల చుట్టూ చైనా కార్యకలాపాలు పెరుగుతుండడం ఫిలిప్పీన్స్‌ను కలవరపెడుతోంది. ఈ నెల 8న దక్షిణ చైనా సముద్రంలో కన్పించిన యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించింది. ఒకవేళ చైనాతో ఘర్షణలు జరిగితే తమకు ఆయుధ కొరత తప్పదని ఫిలిప్పీన్స్ చెబుతోంది. ఏదేమైనా అమెరికా ఎంత కాలం పోరాడుతుందన్న విషయంపై యుద్ధ తీవ్రత ఆధారపడి ఉంటుంది.



