రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రజా సమస్యలపై, అణచివేతలపై ఉద్యమిస్తున్నప్పుడు నిర్బంధాన్ని ప్రయోగిస్తే దానికి రెట్టింపు వేగంతో ఉద్యమాలు వస్తాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వెస్లీ హాజరై మాట్లాడుతూ జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై, అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు బయటకు వచ్చిన వారికి వివిధ రకాలుగా అవార్డులు, రివార్డులు ఇచ్చి సహకరించారనే నెపంతో పలువురిని జైళ్లలో నిర్బంధించడం సరికాదన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ప్రొఫెనర్ ఎం. కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఖైదీల విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం నాయకురాళ్లు శిల్ప, దేవేంద్ర, నవ్వలపై అక్రమ కేసులు నమోదు చేసి ఐదేండ్ల జైలు శిక్ష విధించారని తెలిపారు. దేశంలో శ్రమదోపిడీకి వ్యతిరేకంగా, కులమత విద్వేషాలు లేని సమాజం కోసం అనేక రాజకీయ పార్టీల నాయకులు పోరాటాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. మావోయిస్టు పార్టీకి చెందిన వేలాది మందితోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక కన్వీనర్ జి హరగోపాల్ మాట్లాడుతూ జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ముస్లిం మైనారిటీ రాజకీయ ఖైదీలపై నమోదు చేసిన అక్రమ ఉపా కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ ధర్నాలో ప్రొఫెనర్ జి. లక్ష్మణ్, ఎస్. నారాయణరావు, వి.నంధ్య, సాధినేని వెంకటేశ్వర్రావు, ఎన్.ఎల్.వద్మ తదితరులు పాల్గొన్నారు.


