Sunday, August 30, 2026
E-PAPER
Homeజాతీయంజనగణన ముసుగులో ఎన్‌పీఆర్‌?

జనగణన ముసుగులో ఎన్‌పీఆర్‌?

- Advertisement -

డేటా సేకరణ పేరుతో వ్యక్తిగత వివరాల వేట
కులగణనకు గండికొట్టేలా మోడీ సర్కారు చర్యలు
కులం విషయంలో ‘ఓపెన్‌ కాలం’.. ఓబీసీలకు ప్రత్యేక స్థానం కరువు
2011 అనుభవం నుంచి పాఠాలు నేర్వని కేంద్రం..సామాజికవేత్తలు, నిపుణుల ఆందోళనలు

దేశ జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులను శాస్త్రీయంగా లెక్కించాల్సిన జనగణనపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. 2027 జనగణనలో కులగణనకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నామని కేంద్రం చెప్తున్నప్పటికీ.. కులాన్ని ఓపెన్‌ కాలంలో నమోదు చేయడం, ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఇవి కులగణనను ఉద్దేశపూర్వకంగానే గందరగోళంలోకి నెట్టే ప్రయత్నమా అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరోవైపు ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, మొబైల్‌, బ్యాంకు ఖాతాల వంటి వ్యక్తిగత వివరాలను సేకరించడంపై ‘జనగణన పేరుతో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) తరహా సమాచార సేకరణ జరుగుతోందా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో 1931 తర్వాత తొలిసారిగా కులాల వారీగా జనాభాను లెక్కించనున్నామని కేంద్రం ప్రకటించిం ది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు అవసరమైన వాస్తవ గణాంకాలు అందుతాయని ఆశించిన వేళ.. జనగణన కోసం రూపొందించిన ప్రశ్నావళి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మొత్తం 40 ప్రశ్నలతో రూపొందించనున్న ఫారంలో తల్లిదండ్రుల వివరాలు, డిజిటల్‌ అక్షరాస్యత, కోవిడ్‌ టీకా తీసుకున్న ప్రదేశం, బ్యాంకు ఖాతాల సంఖ్య, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, మొబైల్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను అడగడం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే కులం విషయంలో శాస్త్రీయంగా వర్గీకరించే విధానం లేకుండా ఓపెన్‌ ఎంట్రీకి అవకాశం ఇవ్వడం, ఓబీసీలను ప్రత్యేక కేటగిరీగా చేర్చకపోవడం కేంద్ర ప్రభుత్వ చర్యలపై అనుమానాలు, అనేక ప్రశ్నలకు అవకాశమిస్తున్నాయి.

​జనగణనకు ఇంత వ్యక్తిగత 
సమాచారం ఎందుకో!?
జనగణన ప్రధాన ఉద్దేశం దేశ జనాభా, కుటుంబాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించడం. విధానాల రూపకల్పనకు అవసరమైన గణాంకాలను అందించడం. అయితే వ్యక్తిని నేరుగా గుర్తించగల ఆధార్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, మొబైల్‌ వంటి వివరాలు సేకరించడం సాధారణ జనగణన లక్ష్యాలకు ఎంతవర కు అవసరమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వివరాలు జనగణన కంటే నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను నవీకరించడానికి ఉపయోగపడే అవకాశం ఉందన్న అనుమానాన్ని మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.నారాయణన్‌ ఉన్ని వ్యక్తం చేశారు.

​జనగణనకు.. ఎన్‌పీఆర్‌కు తేడా
జనగణన ప్రధానంగా గణాంకాల సేకరణ, విశ్లేషణ కోసం జరుగుతుంది. ఎన్‌పీఆర్‌ మాత్రం దేశంలో సాధారణంగా నివసించే పౌరుల సమగ్ర వివరాలకు సంబంధించినది. 2010లో తొలిసారిగా ఎన్‌పీఆర్‌ రూపొందించగా.. 2015లో దానిని నవీకరించారు. 2019లో కేంద్ర మంత్రివర్గం ఎన్‌పీఆర్‌ను నవీకరించేందుకు రూ.3,941 కోట్లను కేటాయించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు జనగణన ప్రశ్నావళిలోనూ వ్యక్తిగత గుర్తింపు వివరాలను సేకరించే ప్రయత్నం కనిపిస్తుండటంతో.. జనగణను ఎన్‌పీఆర్‌ తరహా సమాచార సేకరణకు ఉపయోగిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​గోప్యతపై ఆందోళనలు
ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, మొబైల్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలు వంటి వివరాలు ఒకే కుటుంబ రికార్డులో కులం, మతం, భాష, వలస చరిత్ర వంటి సమాచారంతో అనుసంధానమైతే.. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ డేటాబేస్‌లతో అనుసంధానం చేసే అవకాశం ఏర్పడుతుందని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్‌ వివరాలు యూఐడీఏఐ డేటాబేస్‌తో, ఓటరల్‌ ఐడీ ఎన్నికల జాబితాలతో, పాస్‌పోర్టు వివరాలు పాస్‌పోర్టు రికార్డులతో, మొబైల్‌ వివరాలు టెలికాం రికార్డులతో, బ్యాంకు వివరాలు ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యే అవకాశం ఉందని ఐఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది.

​అసలు వివాదం కులగణనే!
అన్నింటికంటే పెద్ద ప్రశ్న కులగణన విషయంలోనే అని చెప్పొచ్చు. కులగణన కోసం దశాబ్దాలుగా డిమాండ్‌ ఉన్నప్పటికీ… 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే బీజేపీ కులగణన డిమాండ్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఇది సమాజాన్ని విభజిస్తుందని వాదించింది. ప్రధాని మోడీ కూడా ప్రతిపక్షాల కులగణన డిమాండ్‌ను విమర్శించారు. అయితే గతేడాది ఏప్రిల్‌ 30న కేంద్ర మంత్రివర్గం తదుపరి జనగణనలో కులగణన చేపట్టాలని ప్రకటించింది. దీంతో కేంద్రం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. కానీ.. ఆచరణలో ప్రశ్నావళి మాత్రం కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది.

​ఓబీసీకి ప్రత్యేక కేటగిరి ఎక్కడ?
ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ, కులం అనే అంశాన్ని చేర్చారు. అయితే ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. దేశంలో సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, విద్యా-ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ఓబీసీ జనాభా గణాంకాలు అత్యంత కీలకం. అలాంటి వర్గానికి ప్రత్యేకంగా ఎందుకు స్థానం కల్పించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​ఓపెన్‌ కాలమ్‌తో మళ్లీ అదే గందరగోళమా?
కులం వివరాలను నమోదు చేసేందుకు ముందుగా గుర్తించిన కులాల జాబితా ఆధారంగా డ్రాప్‌డౌన్‌ విధానం కాకుండా.. వ్యక్తి చెప్పిన కులాన్ని ఓపెన్‌గా నమోదు చేసే విధానం తీసుకొచ్చారు. ఇదే నిర్ణయంపై సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌పాండే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే కులానికి భిన్నమైన స్థానిక పేర్లు, ఉపకులాల పేర్లు నమోదైతే లక్షలాది వేర్వేరు ఎంట్రీలు ఏర్పడి, తుది గణాంకాలు విశ్లేషించడానికి పనికిరాని స్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు.

​2011 అనుభవం ఏం చెప్తోంది?
2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ)లో కుల వివరాలను సేకరించగా.. దాదాపు 46 లక్షల కులాలు, ఉపకులాలు, కులపేర్లు, ఇంటిపేర్లు, వంశంపేర్లు వంటివి నమోదయ్యాయి. తర్వాత కేంద్రం ఈ డేటాలో సాంకేతిక లోపాలున్నాయనీ, దాంతో దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గత అనుభవం ప్రత్యక్షంగా కనబడుతున్నప్పటికీ.. కేంద్రం దాని నుంచి పాఠాలు నేర్వలేదని విశ్లేషకులు చెప్తున్నారు.

​ప్రస్తుత ప్రశ్నావళిని మార్చాలి : రాహుల్‌, ఖర్గే
కులగణనకు సంబంధించిన ప్రస్తుత ప్రశ్నావళిని మార్చాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేసి, రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్‌ చేశారు.

​40 ప్రశ్నలు..11 కొత్తవి
2027 జనాభా లెక్కల కోసం మొత్తం 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని కేంద్ర హౌంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆగస్టు 14న ప్రకటించారు. 2011 జనగణనలో ఉన్న 29 ప్రశ్నలకు అదనంగా మరో 11 ప్రశ్నలను చేర్చారు. కొత్త ప్రశ్నల్లో తల్లి, తండ్రి వివరాలు, శాశ్వత నివాస చిరునామా, డిజిటల్‌ అక్షరాస్యత, కోవిడ్‌ టీకా తీసుకున్న ప్రదేశం, బ్యాంకు ఖాతాల సంఖ్య, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు వంటివి ఉన్నాయి. అందుబాటులో ఉంటే ఆధార్‌, మొబైల్‌, పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడీ నంబర్లను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -