ఆ ఉప్పు నీటి చీకటి బావి
ఎన్ని కండేల లోతో అంతుతెల్వదు!
లోతులోంచి పైకి లాగుతానని
ఏదో అవకాశాల తాడును విసురుతుంది
ఒక మాయా చేయి!
చీకట్లో
కంటిని ఊరించే వెలుగులా
వెండితెర మీద జిగేల్ మనే జిందగీలా…
ఆశల పూలగుత్తిలా
ఆ తాడు మెత్తగా చేతికి అందుతుంది !
రంగు రంగుల కలలు కండ్లలో మెరిసే క్షణాలవి!
ఆశలన్నీ గాలిలో వదిలిన బుడగల్లా,
పిసరంత నిజాన్ని తాకకముందే పేలిపోతాయనీ
ఎగరేసిన చేతులకేం తెలుసు!
గగుర్పాటు కొండచిలువ ఒకటి
ఒళ్ళంతా చుట్టుకునేదాకా…
ఏది తాడో, ఏది పామో నమ్మిన
అమాయక ఆశలకేం తెలుసు!?
మనసు
ఎడారిలో ఒంటరి ఒంటే అయినప్పుడు…
వర్చువల్ ఒయాసిస్ ఒకటి,
స్వచ్ఛ కొలనులో స్వేచ్ఛ నీళ్లు తాగిస్తానని నమ్మిస్తుంది!
దగ్గరకెళ్ళినంక మెత్తని ఇసుకే మింగేస్తదని,
ఊబిలోకి లాక్కుంటుందని ఏం తెలుసు!
ఆశల రైలెక్కించి
కొత్త బంగారు లోకమంటూ నరకకూపంలోకి
అక్రమ రవాణా చేసి,
ఒక్కొక్క అంగంతో ఒక్కో వ్యాపారం చేసే
అమానుష చీకటి మార్కెట్ అది!
సొంత పేర్లను చెరిపేసి
బతుకును అనామిక కథగా మార్చే మాఫియా!
కలలన్నీ కరిగిపోయిన కళ్లు…
నలిగిపోయిన పువ్వులు,
చిరునవ్వులు చీలిపోయిన పెదాల మీద
రక్తపు లిప్‌స్టిక్ పూతలు!
శరీరాలు గాయాల పంటచేన్లు…
మనసు మూలమూలలా
తిరిగి వెళ్ళలేని తలుపుల్ని బాదుతున్న కేకలు!
మనిషి – అక్కడ కేవలం ఒక ఆటబొమ్మ!
చేతులు మారుతున్న కరెన్సీ నోటు!
గుండె గోడును మింగేసే గోడలమీద
బ్రహ్మజెముడు ముళ్ల వికృత సంచారం!
జీవితం ఒక వస్తువులాగా
తూకం వేయబడుతూ
ఎప్పటికో…
దిక్కులేని చీము నెత్తురుల నదిలా
చీకటి సముద్రంలో కలిసిపోతుంది!
ఏ మారుమూలలోనో…
పేదరికం బావిలా మళ్లీ తెరుచుకుంటది
దాని లోతు మరొకరి బలిని సిద్ధం చేస్తూ ఉంటది…
అవకాశాల తాడు మళ్లీ విసరబడుతుంది
మరొక ఆశల చేయి కోసం!
రహీమొద్దీన్, 9010851085
చీకటి బావి
- Advertisement -
- Advertisement -


