నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేపాల్ కు అండగా నిలిచింది. ‘ఆగ్నేయాసియా ప్రాంతీయ ఆరోగ్య అత్యవసర నిధి’ (SEARHEF) నుండి 1,50,000 అమెరికన్ డాలర్ల నిధులను విడుదల చేసింది. “ఈ అత్యవసర నిధులు తక్షణ సహాయక చర్యలకు తోడ్పడతాయి. సహాయక మరియు పునరుద్ధరణ ప్రయత్నాల ద్వారా నేపాల్‌కు అండగా నిలిచేందుకు WHO కట్టుబడి ఉంది” అని WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ నీలేష్ బుద్ధ పేర్కొన్నారు.
భారీ ఆకస్మిక వరదలతో ఆ దేశ వాసులు సర్వం కోల్పోయారు. వరదల ధాటికి నివాసాలు పేకమేడల కూలిపోయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతు కాగా, 600పైగా జనాలు మృతి చెందారు. ప్రస్తుతం ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్, చైనా తోపాటు యూరోపియన్ దేశాలు నేపాల్ కు ఆపన్న హస్తం అందించాయి. బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, వైద్య సామాగ్రి, రెస్క్యు బృందాలను తరలించాయి.



