రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్‌ యూనివర్సిటీలు

రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్‌ యూనివర్సిటీలు– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
–  హైదరాబాద్‌లో యువజన దినోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
నవతెలంగాణ-బేగంపేట్‌
యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని బోట్స్‌ క్లబ్‌లో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం యువజన దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సభలో నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వామి వివేకానంద బోధనలను యువత అనుసరించి.. వారు ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని సూచించారు. తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ప్రయివేటు రంగంలో ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగించుకోవడానికి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. పెద్దఎత్తున జాబ్‌ మేళాలు నిర్వహించి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగం చిన్నది, పెద్దది కాకుండా, ముందుగా ఉద్యోగంలో చేరి అనుభవం గడించి అంచలంచెలుగా పైకి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం యువజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వివిధ సంక్షేమ కార్యక్రమాలను యువత అభ్యున్నతికి చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర యువజన సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యశాచి ఘోష్‌ మాట్లాడుతూ.. వివేకానంద బోధనలు అనుసరణీయమన్నారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సంచాలకులు డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈనెల 5, 6 తేదీల్లో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు నిర్వహించి.. ప్రథమ స్థానం పొందిన వారిని జాతీయ యువజన ఉత్సవాలకు పంపించామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించి యువతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ స్టెప్‌ జనరల్‌ మేనేజర్‌ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love