నిమ్స్‌లో వంద రోబోటిక్‌ సర్జరీలు

నిమ్స్‌లో వంద రోబోటిక్‌ సర్జరీలునవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో 100 రోబోటిక్‌ సర్జరీలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (35), యూరాలజీ (48), సర్జికల్‌ ఆంకాలజీ (17) విభాగాల వైద్యులు శుక్రవారం నాటికి 100 సర్జరీలను పూర్తి చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్పకు నివేదిక అందజేశారు. ఆస్పత్రిలో రోబోటిక్‌ శస్త్ర చికిత్సలు గతేడాది జులైలో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మూడు విభాగాల వైద్యులు అత్యంత సంక్లిష్టమైన చికిత్సలను పూర్తి చేశారు. అత్యంత క్లిష్టమైన సర్జరీ అయిన రోబోటిక్‌ సర్జరీలో కేవలం రంధ్రాలను వేసి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పరికరాలతో పాటు, కెమెరా.. సర్జరీ చేసే వైద్యుడి నియంత్రణలోనే ఉంటుంది. శరీరంలోని ఏ ప్రదేశాన్ని అయినా వైద్యుడు స్పష్టంగా చూసేందుకు వీలుంటుంది. వైద్యులకు అభినందనలుఅతి తక్కువ సమయంలోనే వంద శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన యూరాలజీ వైద్యులు ప్రొఫెసర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌, ప్రొఫెసర్‌ రాంరెడ్డి, డా.విద్యాసాగర్‌, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాధితి రాజశేఖర్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డా.వేణు మాధవ్‌, డా.వర్మ, అనస్థీషియా ప్రొఫెసర్‌ నిర్మల, నర్సింగ్‌, ఇతర సిబ్బందిని డైరెక్టర్‌ భీరప్ప అభినందించారు.

Spread the love