Wednesday, September 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపంటలను కాపాడేదెలా?

పంటలను కాపాడేదెలా?

- Advertisement -

ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి. వాన జల్లులు పడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ అవుతున్నాయి. కానీ నేల తడవాల్సి నంతగా, చెరువులు నిండాల్సినంతగా, పంటలకు ఊపిరిపోసేంతగా వానలు లేవు. ఆగస్టులో అంతంత మాత్రంగానే మురిపించిన వర్షాలు.. సెప్టెంబర్‌లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ తాజా అంచనాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జలవనరులు అడుగంటడంతో పాటు తాగునీటి సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావంతో దేశంలో బలహీన రుతుపవనాలు, తీవ్రమైన ఎండలు ఉంటాయని ముందస్తు అంచనాలు వెలువ డ్డాయి. ఆ అంచనాలను తిప్పి కొడుతూ తెలంగాణలో వానా కాలం సీజన్ ఆరంభంలో వర్షాలు మురిపించాయి. ఆ తర్వాత జులైలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలతో రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు నీటితో కళకళ లాడాయి. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు, మరో ప్రాంతంలో వర్షాభావం అనే అసమాన వర్షపాతాలు నమోదయ్యాయి. ఆ సంతోషంలో రైతులు బావులు, కాలువల పరిధిలో వరి, పత్తి, తదితర పంటలు సాగు చేశారు. వర్షాభావం, ఎల్‌‌నినో వల్ల వాణిజ్య పంటలు సాగు చేయాలని అధికారులు సూచించినా రైతులు వరికే మొగ్గు చూపారు.

65 లక్షల ఎకరాల అంచనాకు గాను 45 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పత్తి 48 లక్షల ఎకరాల్లో వేశారు. మధ్యలో విరామం ఇచ్చినా.. ఆగస్టులో అక్కడక్కడ మురిపించిన వర్షాలతో మరికొన్ని లక్షల ఎకరాల్లో వరి పంట సాగైనా ఆశించిన రీతిలో వానలు లేక సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. వేసిన పంటను కాపాడుకోవడం ఎలా అని అన్నదాత కన్నీరుమున్నీరు అవుతున్నాడు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇప్పటికే రైతాంగం కనీవినీ ఎరుగని రీతిలో ప్రమాదం ఎదుర్కొంటున్న దశలో వాతావరణం కూడా మొహం చాటేయడం రైతును మానసికంగా, ఆర్థికంగా కుంగ దీస్తోంది. రుతుపవనాల విషయంలో చోటు చేసుకున్న వర్షాభావం వానాకాలం సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు మూడు శాతానికి పైగా తగ్గింది. తెలంగాణ లో వరి సాగుపై మొగ్గు చూపినా.. వర్షాలు లేకపోతే ఎంతవరకు దిగుబడి అవుతుందనేది అనుమానమే. జూన్, జులై, ఆగస్టు నెలలో కురవాల్సిన దానికంటే 17 శాతం వర్షపాతం తక్కువగా పడింది. 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. నీరు లేక చాలాచోట్ల భూములు నెర్రెలు బాసాయి. పశువులను మేపుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

ఇలాగే వర్షాభావం కొనసాగితే ఆహార భద్రత, రైతుల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామని, రైతుల ఆదాయాన్ని పెంచుతున్నామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సర్కారూ రైతులను ఆదుకుంటున్నా మని చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో వర్షాధార పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలాంటి సాయాన్ని అందిస్తామన్న భరోసాను రైతులకు చూపడం లేదు. సన్నచిన్న కారు రైతాంగం వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులను కేంద్రం సృష్టిస్తోంది. 25 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదై పంటలు ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. తూతూమంత్రంగా సమీక్షలు తప్ప ప్రత్యామ్నాయ చర్యలకు దిగడం లేదు. ప్రత్యామ్నాయ నీటి వనరులు ఎంతవరకు అందు బాటులో ఉన్నాయి? పంట నష్టానికి పరిహారం ఎంత వేగంగా అందుతోంది? సాగు విస్తీర్ణం తగ్గుతున్నప్పుడు రైతులకు రక్షణ చర్యలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆకాశం వైపు కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్న అన్న దాతకు ప్రభుత్వం భరోసానివ్వకుంటే ఈ వర్షాభావం తీవ్ర ప్రతి కూల సామాజిక ఆర్థిక అసమానతలకు దారితీయడం ఖాయం.

ప్రభుత్వం ప్రకటించే లక్ష్యాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి మరోవైపు ఉన్నప్పుడు… కేవలం విధాన ప్రకటనలతో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడం కష్టం. ఈ అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంతో పాటు కేంద్రప్రభుత్వమూ యుద్దప్రాతిపదికన స్పందించాలి. సాంప్రదాయ ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలి. పంటల బీమా, పరిహారాలను అందించాలి. కరువు బారిన పడిన ప్రతి ఎకరానికి సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతా క్రమంలో పంచాలి. తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూనే, మిగిలిన నీటిని ఆయకట్టు చివరి భూములకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలందించాలి. రైతులు తీసుకున్న సహకార, బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు, కొత్త రుణాలను సులభంగా అందించేలా బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -