పత్రికలు వాస్తవాలను నిర్భయంగా చెప్పాలి

– పత్రిక రంగంలో నవతెలంగాణకు ప్రత్యేక స్థానం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
పత్రికలు వాస్తవాలను నిర్భయంగా చెబుతూ ప్రజలకు పత్రికలు వారధిగా ఉండాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు ప్రజా పాలన కార్యాలయంలో నవతెలంగాణ 2024 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరంలో నవ తెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, నేటి పోటీ ప్రపంచంలో మిగతా పత్రికలకు దీటుగా ఎదగాలని అన్నారు. ప్రజలకు ఉన్న కష్టాలను నిజాలను పత్రికల ద్వారా చెప్పాలన్నారు. వాస్తవాలను ప్రజా సమస్యలను వెలికితీసేందుకు నిరంతరం కషి చేయాలన్నారు. ప్రతి ఏడాది నవతెలంగాణ యాజమాన్యం నాణ్యమైన రంగులతో కొత్త హంగులతో ప్రజలకు నూతన క్యాలెండర్‌ అందించడం సంతోషం అన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పే పత్రికలు రావాలన్నారు. నవ తెలంగాణ అవినీతి, అక్రమాలను ప్రచురించడంలో ముందంజలో ఉంటుం దన్నారు. ప్రధాన స్రవంతిలోని పత్రికలన్నీ వార్తలు, సమాచారాన్ని వినోద ప్రధానంగా మారుస్తున్నాయి తప్ప వాటిని లోతుగా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ప్రచురించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో నవతెలంగాణ లాంటి పత్రికలు ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడడం అభినందనీయమన్నారు. ఏ పార్టీకి కొమ్ము కాయ కుండా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారులకు, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. నూతన ఒరవడితో ముందుకు దూసుకుపోతున్న నవతెలంగాణ దినపత్రిక మరింత అభివద్ధి చెందాలన్నారు. ప్రజల సమస్యలను కళ్లకు కట్టినట్టుగా ప్రత్యేక పరిశీలనాత్మక కథనాలను అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాండూర్‌ పట్టణ అధ్యక్షులు హబీబ్‌ లాల. కౌన్సిలర్‌లు ప్రభాకర్‌ గౌడ్‌, నీరజ బాల్‌ డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ గ్రంథాలయ మాజీ చైర్మన్‌ మురళీధర్‌ గౌడ్‌ అంజయ్య, హర్షవర్ధన్‌ రెడ్డి, మైపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love