నవతెలంగాణ-ఆలేరు టౌను
ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం కావాలని, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిలుకూరి శ్రీనివాస్ అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి చిలుకూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథి చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేయగలడని అన్నారు. విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ, వారు చూపించే మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
సభాధ్యక్షులు బండిరాజుల శంకర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులేనని అన్నారు. ఉపాధ్యాయుల సేవలకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువేనని, ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎదిగినప్పుడు తన గురువులను గుర్తు చేసుకోవాలని సూచించారు. విద్యతో పాటు మానవతా విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు మరింత కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఈ సందర్భంగా రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులను గౌరవించడం తమ సంస్థకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్యం, సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



