Sunday, September 6, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్స్విమ్మర్ టుపారా ట్రయాథ్లెట్‌

స్విమ్మర్ టుపారా ట్రయాథ్లెట్‌

- Advertisement -

శశ్రుతి నకాడే… అంగవైకల్యం కుంగదీయాలని చూసినా సాధించాలనే తపన ఆమెను ప్రపంచం ముందు నిలబెట్టింది. స్విమ్మింగ్‌లో పతకాలు గెలుచుకోవడం నుండి ప్రపంచ 9వ ర్యాంక్ పారా-ట్రయాథ్లెట్‌గా ఎదిగింది. పారిస్ పారాలింపిక్స్‌కు తృటిలో అర్హత సాధించలేకపోయినా ఏ మాత్రం డీలాపడలేదు. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ 2028 గేమ్స్‌కు అర్హత సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

శశ్రుతి వినాయక్ నకాడే కుడి చేతిలో వైకల్యాలతో జన్మించింది. చిన్నతనంలో ఎక్కువ భాగం ఆసుపత్రులలోనే గడిచింది. సాధారణ జీవితాన్ని గడపడానికి వీలుగా అనేక శస్త్రచికిత్సలు చేయించుకుంది. 2014లో ఆమెకు 10 ఏండ్లు ఉన్నప్పుడు కాలును తొలగించే శస్త్రచికిత్స జరిగింది. అదే ఆమె చివరి సారిగా చేయించుకున్న ఆపరేషన్‌. అప్పటి వరకు ఆమె ఉపయోగించిన జైపూర్ పాదం స్థానంలో అధునాతన ఒట్టోబాక్ కృత్రిమ కాలును అమర్చారు. ఆరోజు మారింది ఆమె కాలు మాత్రమే కాదు. ఆ కృత్రిమ కాలు శశ్రుతి జీవితంలో ఒక మలుపుగా నిలిచింది..

శిక్షణకు ఒప్పుకోలేదు
శస్త్రచికిత్సకు ముందు శశ్రుతి ఒక శిబిరానికి హాజరైంది. అక్కడ ఆమె తల్లిదండ్రులకు ఎవరో ఈత నేర్పిస్తే శశ్రుతి మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో తయారవుతుందని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు మొదట సంశయించినప్పటికీ అంగీకరించారు. నాగ్‌పూర్‌లోని స్విమ్మింగ్‌‌పూల్‌‌కి వెళితే ‘మేము వికలాంగులకు శిక్షణ ఇవ్వం’ అన్నారు. అయితే వేసవి సెలవులు రాగానే కేవలం ఆనందం కోసం ఈత నేర్చుకోవాలని శశ్రుతి నిశ్చయించుకుంది. మరింత వెతకగా వారి ఇంటికి సమీపంలో ఒక స్విమ్మింగ్‌‌పూల్‌ కనిపించింది. అక్కడ ఆమెకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు.

మొదటిసారి జాతీయ పోటీలో…
‘నేను ఈత ప్రారంభించాను. నా కాలు తొలగించిన తర్వాత, నేను మరింత చురుకుగా మారాను’ అని శశ్రుతి చెబుతుంది. 2015లో మొదటిసారి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని నాలుగు బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. 2016లో జరిగిన జూనియర్ ఇండియా క్యాంప్‌లో కోచ్‌ ప్రశాంత్ కర్మాకర్ ఆమెను గుర్తించారు. ప్రస్తుతం అతని వద్దే ఆమె శిక్షణ కొనసాగిస్తోంది. 2023 వరకు శశ్రుతి ఒక ఈత క్రీడాకారిణిగా కొనసాగుతూ 10 జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, తన విభాగంలో వ్యక్తిగత టైటిల్‌ను గెలుచుకుంది. 2019-20లో ట్రయాథ్లాన్ కోసం శిక్షణ తీసుకోమని ఆమె కోచ్ సూచించారు. ‘2021లో నేను ట్రయాథ్లాన్‌కు మారినప్పటికీ 2023లో జరిగిన పారా ఏషియన్ గేమ్స్‌లో స్విమ్మింగ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత నేను ట్రయాథ్లాన్‌లో పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ప్రయత్నించాను. అందుకే మేము మా లక్ష్యాలను పూర్తిగా ట్రయాథ్లాన్‌కే మార్చుకున్నాము’ అని వివరిస్తుంది.

ప్రపంచలో నెం.10కి
2024లో సాధించిన మూడు అంతర్జాతీయ విజయాలు ఆమె ర్యాంకింగ్‌ను ప్రపంచ నెం.10కి చేర్చాయి. కానీ ఆమె తృటిలో అర్హతను కోల్పోయింది. కేవలం మొదటి తొమ్మిది మంది మాత్రమే పారిస్‌కు అర్హత సాధించారు. ‘నేను నెం. 9 స్థానంలో ఉండేదాన్ని, కానీ నా నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. దానివల్ల నేను పరుగెత్తలేకపోయాను. ఆ నొప్పి వల్ల నేను నా ఫిట్‌నెస్‌ను కొనసాగించలేకపోయాను. అప్పటి వరకు కేవలం సైక్లింగ్, స్విమ్మింగ్ మాత్రమే చేసేదాన్ని. తర్వాత ట్రయాథ్లాన్ కోసం శిక్షణ కొనసాగించాలనుకున్నాను’ అని ఆమె చెబుతుంది. భారతదేశంలో మోకాలి పైభాగం వరకు అవయవం కోల్పోయిన వారెవరూ పోటీలలో ఐదు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం లేదని ఆమె అంటుంది. దానికి అవసరమైన కృత్రిమ అవయవ సాంకేతికత అందుబాటులో లేకపోవడమే కారణమని ఆమె ఎత్తి చూపుతుంది.

పాల్క్ జలసంధిలో ఈత
అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండకుండా, ఆమెకు కోచ్ ఒక విభిన్నమైన పరీక్షను ప్రతిపాదించారు. అదే ఏప్రిల్ 2025లో పాల్క్ జలసంధిని ఈదడం. తెల్లవారుజాము చీకటిలో ప్రారంభమై, సూర్యుడు అస్తమించే సమయానికి ముగిసిన ఆ ఈత,11 గంటల 30 నిమిషాల పాటు సాగింది. ‘స్విమ్మింగ్ పూల్‌లో అడుగుభాగం కనిపిస్తుంది. కానీ అక్కడ అలా వుండదు’ అని ఆమె ఆ సముద్రం గురించి చెప్పింది. చివరి రెండు గంటలలో తీరం కనిపిస్తున్నప్పటికీ చేరుకోవడానికి చాలా దూరంగా ఉంది. తనకు తోడుగా వస్తున్న పడవ ఆమెతో ‘పదిహేను నిమిషాలు, పదిహేను నిమిషాలు’ అని చెబుతూనే ఉంది. ‘అతని మీద నాకు చాలా చిరాకు వచ్చింది. ఎందుకు అబద్ధం చెబుతున్నావు? సరిగ్గా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పు’ అని గట్టిగా అరిచాను. ఏదేమైనా ఆమె దాన్ని పూర్తి చేసింది.

పారా-ట్రయాథ్లాన్ కోసం శిక్షణ
ఈ ఏడాది ఆరంభంలో శశ్రుతి సమర్‌ఖండ్‌లో జరిగిన వరల్డ్ ట్రయాథ్లాన్ పారా కప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ఆ తర్వాత పుణెలో జరిగిన పారాట్రై నేషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. జర్మనీలో జరిగిన వరల్డ్ ట్రయాథ్లాన్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో, హంగరీలో జరిగిన వరల్డ్ కప్‌లో పాల్గొని తన ర్యాంకింగ్‌లను మెరుగుపరుచు కుంది. ప్రస్తుతం ప్రపంచంలో 9వ ర్యాంక్‌లో ఉన్న ఆమె, సెప్టెంబర్ నెలాఖరులో స్పెయిన్‌లో జరగనున్న వరల్డ్ ట్రయాథ్లాన్ పారాఛాంపియన్‌ షిప్స్‌కు అర్హత సాధించింది. పారా-ట్రయాథ్లాన్‌లో 750 మీటర్ల ఈత, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల పరుగు ఉంటాయని శశ్రుతి చెబుతుంది.

స్పష్టమైన లక్ష్యాలు…
శశ్రుతికి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పరుగుతో మొదలవుతుంది. ఆ తర్వాత పునరావాస సెషన్ ఉంటుంది. ఉదయం 11 గంటలకు బైక్ సెషన్ చేస్తుంది. సాయంత్రం 5 నుండి 7:30 వరకు ఈత కొడుతుంది. ఆమె లక్ష్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించడం, తన ర్యాంకింగ్‌ను 7వ స్థానానికి మెరుగుపరచుకోవడం, 2027 సర్క్యూట్‌లో నాలుగు నుండి ఐదు పోటీలలో పాల్గొని, 5వ లేదా 6వ స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం, 2028లో ఎల్ఏ పారాలింపిక్స్‌లో స్థానం సంపాదించడం.

క్షేత్రస్థాయిలోనే జరగాలి
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న తన దినచర్య 2014 నుండి కొనసాగుతోంది. ఆమె తల్లి హర్యానాలోని భివానీలో ఆమెతో కలిసి ఉంటుంది. ఇది ఆమె ప్రస్తుత శిక్షణా కేంద్రం. అవరమైనప్పుడు తన కుమార్తెకు చికిత్స అందించడం కోసం ఆమె ఎన్‌ఐఎస్‌ పాటియాలాలో మసాజ్ థెరపీ కోర్సును కూడా పూర్తి చేశారు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్ శశ్రుతికి మద్దతుగా నిలిచింది. కృత్రిమ అవయవాలతో పాటు పోషణ, ఇతర అవసరమైన సహాయాన్ని అందించింది. భారతదేశంలో వికలాంగుల పట్ల అవగాహన గతంలో కంటే కొంత మెరుగ్గా ఉందని ఆమె అంటుంది. ‘వికలాంగులకు తగిన క్రీడను గుర్తించి, వారి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం ముఖ్యం. ఇది క్షేత్రస్థాయిలోనే జరగాలి. భారతదేశ స్వాతంత్రానికి వందేండ్లు వచ్చినప్పుడు, మనం పారాలింపిక్స్‌లో వంద పతకాలు గెలవాలనేది నా కోచ్ కల’ అని ఆమె అంటుంది.

– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -