Sunday, September 6, 2026
E-PAPER

వాగు

- Advertisement -

ఆదివారం ఉదయం. ఊరి చివరి మలుపు తిరిగిన దగ్గర నుంచే వాగు శబ్దం వినిపించింది. నీటి హోరు. మధ్యమధ్యలో పిల్లల కేరింతలు. ఆమె నా చేతిని వదిలేసి ముందుకు నడిచింది.
“వచ్చేశాం.”
“కనిపించట్లేదే.”
“వినిపిస్తోంది.”
“ఇంకొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది.”
చెట్ల మధ్య నుంచి వాగు కనిపించగానే ఆమె ముఖం వెలిగిపోయింది. నిన్నటి వర్షానికి వాగు నిండుగా పారుతోంది. రాళ్లను తాకుతూ నీళ్లు తెల్లని నురుగుల్ని చిమ్ము తున్నాయి. ఎండ పడిన చోట వెండిలా మెరుస్తూ, చెట్ల నీడల్లో ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి.
ఒడ్డంతా ఆదివారం సందడి.
పిల్లలు నీళ్లలో రాళ్లు విసురుతూ, ఒకరినొకరు వెంటాడుతున్నారు. కొంచెం దూరంలో ఇద్దరు పెద్దలు వల విసురుతున్నారు. మరోచోట గాలాలు వేసుకుని ఇద్దరు యువకులు రాళ్లమీద కూర్చున్నారు. గట్టుమీద ఆడవాళ్లు బట్టలు ఉతుకుతున్నారు. పక్కనే రెండు ఎద్దులు నీళ్లలో నిలబడి ఉన్నాయి.
ఎక్కడో ఒక పిల్లాడు—
“చేప! చేప!”
అని కేకేస్తే, ఆ శబ్దానికి ఇంకో నలుగురు పిల్లలు పరుగెత్తుకొచ్చారు. వాగు మాత్రం అందరి మధ్యగా తన హడావుడిలో తాను పారిపోతోంది.
“చూడు… ఊరంతా ఇక్కడేవుంది.” అంటూ చెప్పులు తీసి ఒడ్డున పెట్టింది.
“నువ్వూ వస్తావా?”
“నువ్వు ఆగితే.”
“నేను ఆగను.”
అని నీళ్లలోకి దిగిపోయింది. నేను నవ్వుకుంటూ వెనకే వెళ్లాను. మొదటి అల ఆమె పాదాలను తాకగానే కళ్లుమూసుకుంది.
“అబ్బా…”
ఆమె ముఖంలోకి చూసి నవ్వొచ్చింది.
“ఏమిటి?”
“ఏమీ లేదు.”
“నవ్వుతున్నావు.”
“చిన్నపిల్లలా ఉన్నావు.”
“అయితే నువ్వు పెద్దవాడివా?”
అంటూ రెండు చేతులతో నీళ్లు తీసి నా మీద చల్లింది.
పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు నవ్వారు.
“అక్కా! ఇంకోసారి!”
“మీరెవరి వైపు?” అన్నాను.
“అక్క వైపు!”
ఆమె వాళ్లకు హై-ఫైవ్ ఇస్తూ అంది…
“విన్నావా”
“అయితే మీ ముగ్గురి సంగతీ చూస్తా.”
నేను నీళ్లు ఎత్తి ముగ్గురిమీదా చల్లాను. ముగ్గురూ కేకలు పెట్టారు. వాగు శబ్దంలో నవ్వులు కలిసిపోయాయి. కొద్దిసేపటికి ఆమె చూపు అవతలున్న పెద్ద నల్లరాయి మీద పడింది.
“అక్కడికి వెళ్దాం.”
“వద్దు.”
“ఎందుకు?”
“లోతుంటుంది.”
ఆమె వెనక్కి తిరిగి చూసింది.
“నువ్వు ఉన్నావుగా.”
అంటూ అడుగు ముందుకేసింది.
నీరు తొడల్ని తాకింది.
అప్పుడే—
“అమ్మా!”
ఒక కేక. ఆమె ఒక్కసారిగా నా వైపు తిరిగింది. పిల్లల నవ్వులు ఆగిపోయాయి. చిన్న బాబు రాళ్ల మీద నుంచి జారి ప్రవాహంలో పడిపోయాడు.
అతని తండ్రి వెంటనే దూకాడు.
బాబు ఒక్కసారి పైకి వచ్చాడు.
“నాన్నా!”
మళ్లీ నీళ్లలో కలిసిపోయాడు.
నేను ముందుకు వెళ్లాను.
“రామ్!”
ఆమె కేక వెనకే వినిపించింది. నీరు నడుము దాటుతోంది. కాళ్ల కింద రాళ్లు కదులుతున్నాయి. బాబు మళ్లీ కనిపించాడు. చేయి చాపాను. అందలేదు. మరో అడుగు వేసి అతని చొక్కా పట్టుకున్నాను. అదే సమయంలో కాలు జారింది. ప్రవాహం నన్ను ముందుకు లాగింది. వెనక నుంచి ఆమె చేయి నా మణికట్టును పట్టుకుంది.
“రామ్!”
“బాబుని పట్టుకున్నాను.”
ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. నా చేయి మాత్రం వదల్లేదు. బాబు ఏడుస్తున్నాడు. ఇంతలో అతని తండ్రి వచ్చి మరోవైపు నుంచి పట్టుకున్నాడు. ఒడ్డునున్న ఇద్దరు యువకులు నీళ్లలోకి దిగారు.
“లాగండి!”
అందరి చేతులు ఒక్కసారిగా ఆ చిన్న శరీరం చుట్టూ చేరాయి.
తర్వాత బాబు ఒడ్డున ఉన్నాడు.
అతని తల్లి పరుగెత్తుకొచ్చి గుండెలకు హత్తుకుంది.
బాబు దగ్గుతున్నాడు.
ఎవరో తువ్వాలు అందించారు.
ఎవరో “ఏమీ కాలేదు” అన్నారు.
ఆ హడావుడి మధ్య ఆమె మాత్రం నా దగ్గరే నిలబడి ఉంది. నా మణికట్టును ఇంకా వదల్లేదు.
“రా,” అన్నాను.
చెట్టు కిందికి వెళ్లాం. ఆమె కూర్చుంది. నేను పక్కనే కూర్చున్నాను. కొద్దిసేపు వాగు శబ్దం తప్ప మరేమీ లేదు. ఆమె నా చేతివైపు చూసింది. తర్వాత తన తడి జుట్టును వెనక్కి జరుపుకుంది.
నా చేతిని తన చేతిలోకి తీసుకుంది.
వాగువైపు చూస్తూ అలాగే కూర్చుంది.
నేను ఆమె వేళ్లను నెమ్మదిగా బిగించాను.
ఆమె నా భుజానికి తల ఆనించింది.
కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూసింది.
నేను ఆమె నుదుటిపై ముద్దుపెట్టాను.
ఆమె కళ్లుమూసుకుంది.
కొద్దిసేపటికి ఆ హడావుడి మళ్లీ మామూలైంది.
పిల్లలు తిరిగి నీళ్లలోకి దిగారు.
ఎవరో మళ్లీ వల విసిరారు.
గట్టుమీద బట్టలు ఉతుకుతున్న ఆవిడ తన పని తిరిగి మొదలుపెట్టింది.
వాగు మాత్రం ఏమీ జరగనట్టే పారుతోంది. ఆమె నా పక్కన కూర్చుని నీళ్లను చూస్తోంది.
“ఏమాలోచిస్తున్నావు?” అన్నాను.
“చిన్నప్పుడు… వాగు చాలా పెద్దదనిపించేది.”
నేను నవ్వాను.
“ఇప్పుడు?”
“ఇప్పుడు కూడా పెద్దదే.”
“మరి?”
ఆమె కొద్దిసేపు నీళ్లను చూస్తూ ఉండిపోయింది.
“నాన్నతో వచ్చినప్పుడు… ఆయన చేయి పట్టుకునేదాన్ని.”
నా వైపు చూసి చిన్నగా నవ్వింది.
“ఈరోజు నువ్వు ఉన్నావు.”
వాగు శబ్దం మధ్య ఆ మాట నాలో చాలా సేపు వినిపిస్తూనే ఉంది.
ఆమె మెల్లగా లేచింది.
నేనూ లేచాను.
గట్టుమీద నడుస్తుంటే వెనక నుంచి ఒక పిల్లాడు కేకేశాడు—
“అక్కా! మళ్లీ రా!”
ఆమె వెనక్కి తిరిగి నవ్వింది.
“వస్తా.”
మేము ముందుకు నడిచాం.
కొద్దిదూరం వెళ్లాక ఆమె ఆగి నా వైపు చూసింది.
“రామ్… వచ్చే ఆదివారం మళ్లీ వద్దాం.”
నేను ఏమీ అనలేదు.
ఆమె నవ్వింది.
కొద్దిసేపు నిశ్శబ్దంగా నడిచాం.
వాగు శబ్దం మాత్రం ఇంకా వెనకే వినిపిస్తోంది.
తర్వాత…
ఆమె మెల్లగా నా చేయి పట్టుకుంది.
అంతే… నా లోపల కూడా ఒక వాగు మొదలైంది.
రామ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -