Sunday, September 6, 2026
E-PAPER
Homeసోపతికాలం చెరిపేయలేని సంతకం.. సారంపల్లి

కాలం చెరిపేయలేని సంతకం.. సారంపల్లి

- Advertisement -

నివాళి
7న హైదరాబాద్‌లో సారంపల్లి మల్లారెడ్డి సంతాపసభ సందర్భంగా

నిత్యం ఎంతోమంది పుడతారు.. కాలప్రవాహంలో కొట్టుకుంటూ చివరకు కన్ను మూస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే మరణం తర్వాత కూడా జీవించి ఉంటారు. తాము చేసే పనులు, తమదైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో, వారి జ్ఞాపకాల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ప్రముఖ రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి ఒకరు. నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని కృషితో తన జీవితాన్నంతా రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన కోసమే ధారపోసిన నిస్వార్థ నాయకుడు. బతికున్నంత వరకు పేదల సంక్షేమం కోసమే పనిచేసిన ఆయన.. మరణం తర్వాత తన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ ఆస్పత్రికి అర్పించి అమరత్వానికి అసలైన అర్థం చెప్పిన ధన్యజీవి.
ముఖంపై చెరగని చిరునవ్వు, ఆబాలగోపాలాన్ని ప్రేమతో ఒకే రీతిన పలకరించే గొప్ప మనసున్న మల్లారెడ్డి గారితో నాకు రెండు దశాబ్దాల కిందట రైతు సంఘం కార్యాలయంలో పరిచయం ఏర్పడింది. జాబ్‌ కోసం బాబూరావు(అప్పటి రైతు సంఘం నాయకులు) గారు నన్ను రైతువాణి ఆఫీస్‌కు పిలిచిన తొలి రోజు మల్లారెడ్డి గారిని చూశాను. ఆ పరిచయమే.. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన నాకు ఆయన కుటుంబ సభ్యుల ఆదరణ, ఆప్యాయతకు నోచుకొనేలా చేసింది. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉండి.. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ జీవితమంతా రెండు చిన్న గదుల అద్దె ఇంట్లోనే ఆదర్శప్రాయంగా జీవించారు.

పలకరింపులో ఆప్యాయత
నిరాడంబరత, త్యాగాలకు నిలువెత్తు దర్పణమైన ఆయనతో కలిసి రైతుసంఘంలో పనిచేసిన రోజులు, వారి ఇంట్లో భోజనం చేసిన సందర్భాలూ నేనెప్పటికీ మరిచిపోలేను. ఆ తర్వాత కొన్నేళ్లకు రైతువాణి నుంచి బయటకు వచ్చినప్పటికీ నేను ఎక్కడ తారసపడినా ఆప్యాయంగా పలకరించి కష్టసుఖాలు అడిగేవారు. ఇక బాబూరావు గారి పక్కన నేను కనబడితే.. ‘ఒకచోట చేరారా?’ అని అంటే బాబూరావు గారు పేల్చే జోకులకు ముసిముసి నవ్వులు చిందిస్తూ ఏదో పేపర్‌ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయే సందర్భాలు అనేకం.

సునిశిత అధ్యయనం ఆయన సొంతం
రైతు సమస్యలు, సామాజిక సమస్యలపై సునిశితంగా అధ్యయనం చేయడం ఒక ఎత్తయితే.. 80 ఏండ్ల వయసులోనూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, కొత్తగా వచ్చిన సినిమాలను సైతం చూసి తన అభిప్రాయాలను నేటి తరంతో షేర్‌ చేసుకోగలగడం ఒక్క మల్లారెడ్డి గారికే చెల్లింది. కోట్లు కూడబెట్టినా అసంతృప్తిగానే బతుకుతున్న మనుషులే ఎక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో.. నిరాడంబరత, నిస్వార్థం, మార్క్సిజమే తన శ్వాసగా బతికిన మల్లారెడ్డి గారి జీవితం తరతరాలకు ఆదర్శనీయం.. ఎంతో స్ఫూర్తిదాయకం.

ఓ సమాచార నిధి
రైతు సమస్యలపై ఎంత సీరియస్‌గా అధ్యయనం చేసేవారో.. పోరాటంలోనూ అంతే ముందుండేవారు. బడ్జెట్‌ను విశ్లేషించడంలోనూ ఆయనది విశిష్టమైన శైలి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ వచ్చిందంటే చాలు.. ప్రత్యేకంగా వ్యవసాయం, నీటిపారుదల, ఎరువులకు జరిపిన కేటాయింపులపై నోట్‌లు తయారు చేసేవారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులకు ఆయనొక సమాచార నిధిగా ఉండేవారు. నేను రైతువాణిలో వర్క్‌ చేసేటప్పుడు ‘బడ్జెట్ గురించి ఎవరైనా అడిగితే.. వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉండేలా ఒక నోట్‌ ప్రిపేర్‌ చేద్దామా?’ అంటూ గత బడ్జెట్‌ గణాంకాలు, ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను సరిపోల్చుతూ ఆయన చేసే విశ్లేషణ, వృద్ధాప్యంలోనూ ఆయన జ్ఞాపకశక్తి ఆశ్చర్యం కలిగించేది.

యోధుడికి అశ్రు నివాళి
ఈ ఏడాది జులై రెండో వారంలో కూడా వ్యవసాయ సంస్కరణలపై ఆయన రాసిన ఓ నోట్‌ వాట్సప్‌లో నాకు పంపి చదివి చెప్పమనడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాను. బడ్జెట్‌ను ఎలా అధ్యయనం చేయాలో ఆయన వద్దకు వెళ్లి నేర్చుకోవాలని భావించినా.. నా కోరిక నెరవేర్చుకొనేలోపే ఆయన మనందరినీ వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరం. మల్లారెడ్డిగారు లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం ఆయనతో పరిచయం ఉన్న ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. జీవితాంతం కర్షకులు, కార్మికులు, పేద ప్రజల కోసమే బతికిన ఆ నిస్వార్థ కమ్యూనిస్టు యోధుడికి అశ్రు నివాళి!
అరు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -