Friday, April 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం

- Advertisement -

భారత్‌-పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన ఎంపీ తేజస్వీ సూర్య
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్‌, జాగృతి ఖండన
బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
వ్యాఖ్యలను వక్రీకరించారన్న రామచంద్రరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అవుతున్నా బీజేపీ ఇంకా విషం చిమ్ముతున్నది. పార్లమెంటు వేదికగా తెలంగాణ ఏర్పాటును అవమానపర్చడం గమనార్హం. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గురువారం పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును భారత్‌-పాకిస్తాన్‌ విభజనతో ఆయన పోల్చిన విషయం తెలిసిందే. తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్‌, తెలంగాణ జాగృతి, ఆప్‌ తీవ్రంగా ఖండించాయి. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనీ, ఆయనతోపాటు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

తేజస్వీ సూర్యను బర్తరఫ్‌ చేయాలి : మంత్రి పొన్నం
తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణపై అవహేళనగా మాట్లాడిన తేజస్వీ సూర్య పార్లమెంట్‌ సభ్యత్వాన్ని తొలగించి బర్తరఫ్‌ చేసి, ఆయన మాటలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. పార్లమెంటులో ఆమోదించిన బిల్లులను అవమానిస్తుంటే తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎంజారు చేశారని ఎద్దేవా చేశారు.

అజ్ఞానానికి పరాకాష్ట : జూపల్లి
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును భారత్‌-పాకిస్తాన్‌ విభజనతో పోల్చడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోడీ కూడా ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’అని అన్నారనీ, ఆ విద్వేష భావజాలమే ఇప్పుడు ఎంపీ తేజస్వీ సూర్య మాటల్లో ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

తెలంగాణ అస్తిత్వంపై బీజేపీకి గౌరవం లేదు : కేటీఆర్‌
పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీకి గౌరవం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును భారత్‌-పాకిస్థాన్‌ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడం సరైంది కాదని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ నుంచి ఎంపీ తేజస్వీ సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య, బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన సూర్య : హరీశ్‌రావు
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆవిర్భావం దశాబ్ధాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని తెలిపారు. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేననీ, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే అవుతుందని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తేజస్వీ సూర్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అవివేకమని మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తేజస్వి సూర్యను వెంటనే పార్లమెంటు నుంచి సస్పెండ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, దేశపతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సూర్య వ్యాఖ్యలను కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ దేవీప్రసాద్‌ ఖండించారు.

తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దురహంకారపూరితం : జాన్‌వెస్లీ
పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును భారతదేశ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. బ్రిటీష్‌ వారు భారతదేశాన్ని, పాకిస్తాన్‌ను విడగొట్టిన పద్ధతిలోనే ఆంధ్ర-తెలంగాణ విభజన జరిగిందని తేజస్వి సూర్య మాట్లాడటం ఆయన అజ్ఞానానికి, తెలుగు ప్రజల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనమని విమర్శించారు. దశాబ్దాల పోరాటాలు, వందలాది మంది బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక దేశ విభజన నాటి రక్తపాతంతో పోల్చడం అత్యంత హేయమని తెలిపారు. ఒకవైపు తామే తెలంగాణ ఇచ్చామనీ, ఇక్కడ ‘విమోచన దినోత్సవాలు’ జరుపుకుంటామని చెప్పుకునే బీజేపీ నాయకులు పార్లమెంటులో మాత్రం రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచేలా మాట్లాడటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. నాడు బిల్లుకు మద్దతు పలికిన వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్‌ వంటి నేతల నిర్ణయాలను ఇప్పుడు తేజస్వీ సూర్య తప్పుబడుతున్నారా?అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, దక్షిణాది రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడకుండా ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా చర్చను పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు వారి పార్టీ ఎంపీలు రాష్ట్రాన్ని అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, తెలుగు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

తేజస్వీ సూర్య క్షమాపణ చెప్పాలి : ఈటి నరసింహ
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తక్షణమే క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ డిమాండ్‌ చేశారు. గతంలో ప్రధాని మోడీ కూడా తెలంగాణ ఏర్పాటును కించపరిచి తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ అక్కసును వెలగక్కారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ప్రజలు వారికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

సూర్య వ్యాఖ్యలను బీజేపీ ఖండించాలి : కవిత
తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు పౌరుషముంటే సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్‌ చేశారు. సూర్యతో క్షమాపణ చెప్పించకపోతే ఈ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత వారికి లేదని పేర్కొన్నారు. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, అమరవీరులను అవమానపరిచేలా ఉన్నాయని తెలిపారు.

బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి : ధర్మార్జున్‌
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేశారనీ, దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్‌ డిమాండ్‌ చేశారు. తేజస్వీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

కించపరిస్తే ఊరుకోం : ఆప్‌
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుర్ర రాముగౌడ్‌ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చలేదు : రామచంద్రరావు
తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. భారతదేశ విభజన సమయంలో జరిగిన ప్రాణ నష్టాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ తెలంగాణ ఏర్పాటులో కూడా అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారంటూ తమ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు వక్రీకరిస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -