– దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ: సామాజికవేత్త, ప్రజానాట్యమండలి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీఏ.దేవి
– రక్తసంబంధం కన్నా వర్గ సంబంధమే కీలకమని నేర్పేది పీఎన్‌ఎమ్ : వేముల పుష్ప
– మరో ప్రపంచం కోసం ఎదురుచూస్తున్నాం : డాక్టర్ నీలిమ
– కళాప్రదర్శనలు వీక్షణతో ఆరోగ్యం మెరుగు: మిమిక్రీ ఆర్టిస్టు మల్లం రమేశ్
– ట్రాఫిక్ రూల్స్‌పై కళాకారులు ప్రచారం చేయాలి : సీఐ నాగమల్లు
– ఉత్సాహపూరిత వాతావరణంలో కళారూపాల ప్రదర్శన
– ఆకట్టుకున్న హరేరామహరే కృష్ణ నృత్యరూపకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జానపదం జాతి జీవనాడి అనీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని సామాజికవేత్త, ప్రజానాట్య మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీఏ దేవి నొక్కిచెప్పారు. పాలకుల అణచివేత రూపాలు ఏవిధంగా ఉండేవి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే సమాచారాన్ని జానపదం ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగుతున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభలో భాగంగా గురువారం సాయంత్రం సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారులు ప్రదర్శించిన డప్పుల నృత్యం, నల్లగొండ కళాకారుల చెక్కభజన, రంగారెడ్డి జిల్లా కళాకారుల ఆడపిల్ల ఒగ్గుకథ, చిన్నారి మేఘన కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కులం పేరుతో చిన్న చూపు చూడటం సరిగాదు.. మనుషులందరూ ఒక్కటే అని హరేరామ హరేకృష్ణ హాస్య నృత్యరూపకం ద్వారా కండ్లకు కట్టినట్టు చూపారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. జానపదాలు పాడేటప్పుడు గుండ్రంగా తిరుగడంలో అందరూ సమానమేననే భావన దాగి ఉంద న్నారు. జానపదాన్ని జనం అల్లుకుంటారనీ, 100 రకాల పనులుంటే వాటిమీద 150 రకాల జానపద పాటలున్నాయని వివరించారు. జనం గుండెచప్పుడు జానపదం అనీ, దానికి రాగం కట్టింది ప్రజలేనని చెప్పారు. ప్రపంచీకరణ తర్వాత జనం వలసలు పెరిగాయనీ, పని నుంచి పాట దూరమవు తున్నదని తెలిపారు. జానపదం జనం గురించి మాట్లాడటం మానేసిందన్నారు. మైకులు, యంత్రాల్లోకి వెళ్లిపోయిందనీ, జనం నుంచి నెట్టివేయబడుతున్నదని చెప్పారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన తెలంగాణ సాయుధ పోరాటంలో జానపదం విప్లవగీతమై ప్రజల్ని కదిలించిందని గుర్తుచేశారు. దొరలు, భూస్వాములు, నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ జానపదం గొంతెత్తిందనీ, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబింపజేసిందని తెలిపారు. అలాంటి జానపదాలు నేడు ప్రజలకు దూరమవుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలనీ, తమ ప్రదర్శనలకు డబ్బులు ఇవ్వాలని పాలకులను అడుక్కో వాల్సిన పరిస్థితికి జానపద కళాకారులు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమూ సాంస్కృతిక రంగం ముందుకు వెళ్లేందుకు సహకరించదన్నారు. ప్రజల ఆకాంక్షలను ఎత్తిచూపే జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపైనా ఉందని నొక్కిచెప్పారు.
నీలిమ ఆస్పత్రి ఎమ్‌డీ డాక్టర్ నీలిమ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో చదువు కునే రోజుల్లోనే తనకు ప్రజానాట్యమండలి పరిచయమైందన్నారు. ప్రజల కోసం కళను ప్రదర్శిస్తూ సప్ధర్ హష్మి ప్రాణాలను త్యాగం చేయడం గొప్ప విషయమన్నారు. తూటా ఎంత పదునైందో డప్పు, డోలు, పాట కూడా అంతే పదునైనవనీ, వాటితో సమాజంలో మార్పు తేవచ్చునని ఆకాంక్షించారు. మరో ప్రపంచం కోసం ఆశతో ఎదురుచూస్తున్నామనీ, ప్రజలను చైతన్యపర్చడంలో ప్రజా నాట్యమండలి ముందువరుసలో ఉండాలని ఆకాంక్షించారు.
గాయని వేముల పుష్ప మాట్లాడుతూ..రక్త సంబంధం కంటే వర్గ సంబంధమే ముఖ్యమని నేర్పిన ప్రజానాట్యమండలి కి, భార్య చనిపోయినా సంఘం కోసం ఇక్కడకు వచ్చిన ఆనంద్ కు వందనాలు అంటూ సెల్యూట్ చేశారు. సమాజంలో ఎన్నో అవకాశాలున్నప్పటికీ ప్రజల కోసం కళలను ప్రదర్శిస్తున్న ప్రజా నాట్యమండలి కళాకారులకు అభినందనలు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న రెండు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మహిళా బిల్లు, డీలిమిటేషన్ పల్లవిని మోడీ సర్కారు ఎత్తుకున్నదని విమర్శించారు. మహిళను ప్రధాని చేస్తామని మోడీ ప్రకటిస్తే స్వాగతించేవారమన్నారు. ఆరుకూరలతో అన్నం తినడం కంటే మూడుబాటల కూడలిలో కళారూపాలను ప్రదర్శించి పేదల ఇండ్లలో అన్నం తిన్న రోజులే బాగుండేవని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు పాటలు పాడి కళాకారులను ఉత్తేజపర్చారు.
ట్రాఫిక్ సీఐ నాగమల్లు మాట్లాడుతూ…’బండెనక బండి కట్టి’ పాట పాడిన యాదగిరిది తమ పక్క ఊరే కావడం గర్వ కారణంగా ఉందన్నారు. ప్రజల్ని తమ కళల ద్వారా చైతన్య పరిచే కళాకారులు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌పైనా, ప్రమాదాల నివారణపైనా పీఎన్‌ఎమ్ కళారూపాలను ప్రదర్శించాలని కోరారు. ‘రయ్యురయ్యుమని బైకుపైన పోయే చిన్నోడా… బొక్క బోర్లా పడ్డావంటే ప్రాణం పోతుందిరా చిన్నోడా’ అంటూ పాట పాడుతూ చైతన్యం నింపారు.
మిమిక్రీ ఆర్టిస్టు, ఆహ్వాన సంఘం సలహాదారులు మల్ల రమేశ్ మాట్లాడుతూ.. కళా ప్రదర్శనలు జరిగే చోట రోగులను కూర్చోబెడితే వారిలో సగం రోగాలు నయం అవుతాయన్నారు. ఇవి తినొద్దు..అవి తినొద్దు.. ఇవి తాగొద్దు.. అవి తాగొద్దు అని చెప్పే డాక్టర్లు తమ ఆస్పత్రుల్లోనే వాటిని అమ్ముతుండటం విడ్డూరంగా ఉంద న్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన కళాకారులు తమ కింది స్థాయిలో ఉన్న కళాకారులను మరువొద్దనీ, వారి సంక్షేమం పట్ల ఎంతో కొంత చేయాలని విన్నవించారు. కరోనా కాలంలో తాను రెండున్నర లక్షల రూపాయలు పంచానని గుర్తుచేశారు. మహాసభ ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి మారన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షులు వేముల ఆనంద్, కార్యదర్శి కట్ట నర్సింహ, ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
జానపదం జాతి జీవనాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



