Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలి

కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలి

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి
వారి హక్కులను కాపాడాలి.. పథకాలు వర్తింపజేయాలి
రైతులకు ద్రోహం చేయడం దేశభక్తి కాదు: రైతు స్వరాజ్యవేదిక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011 ప్రకారం రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి వారి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి సర్కారు నెరవేర్చాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కౌలు రైతుల గుర్తింపు, హక్కుల సాధన’ అనే అంశంపై రైతు స్వరాజ్యవేదిక రాష్ట్ర నాయకులు విస్సాకిరణ్‌, బి.కొండల్‌ సమన్వయంతో మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్నవారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జస్టిస్‌(రిటైర్డ్‌) చంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి(ఆర్థికవేత్త), కన్నెగంటి రవి(రైతు స్వరాజ్య వేదిక), ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాద్‌రావు(తెలంగాణ రైతు సంఘం), పి.శంకర్‌ (డీబీఎఫ్‌), అంబటి నాగయ్య(టీవీవీ), రవిచందర్‌(తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ), మీరా సంఘమిత్ర(ఎన్‌ఏపీఎమ్‌), ఎం.ఆంజనేయులు(సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం), జక్కుల వెంకటయ్య(తెలంగాణ రైతాంగ సమితి), వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ శరత్‌బాబు, అడ్వకేట్‌ మహ్మద్‌ సాధిక్‌ అలీ, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు స్వరాజ్య వేదికకు చెందిన వారు కౌలు రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొం టున్న ఇబ్బందులపై లఘునాటికను ప్రదర్శించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ… కష్టాలు వస్తుంటాయి.. పోతుంటా యనీ, అప్పుల బాధతో కౌలు రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని అధికారంలోకి రావడం, ఆ తర్వాత వారిని విస్మరించడం పాలకులకు ఒక అలవాటుగా మారిందని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోని మోడీ సర్కారు అన్నదాతలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేస్తామని ప్రజలకు హామీనిచ్చి…గద్దెనెక్కాక వాటిని అమలు చేయలేమని సుప్రీం కోర్టుకు మోడీ సర్కారు చెప్పడం దుర్మార్గమ న్నారు. కౌలు రైతుల ఆదాయం పెరగనంత వరకు వ్యవసాయ రంగం సంక్షోభంలోనే ఉంటుందని హెచ్చరించారు. కౌలురైతులపై పాలకుల క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండించారు. పాలకుల విధానాలతో 80 శాతం మంది రైతుల పిల్లలు తిరిగి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేరని చెప్పారు. యూఎస్‌ నుంచి వ్యవసాయ దిగుమతులపై జీరో సుంకం విధించి, మన దేశం అమెరికాకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై 18 శాతం ట్యాక్స్‌ వేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం మన దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడేమని విమర్శిం చారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తిరైతులు ఆగమవుతారని హెచ్చరించారు. ఇలా రైతులకు ద్రోహం చేయడం దేశభక్తి ఎలా అవుతుందని మోడీ సర్కారును ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ 46 శాతం మందికి భూమి లేదని ఎత్తిచూపారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చేసిన తీర్మానాలు
ప్రతి జిల్లాలోనూ కొన్ని గ్రామాలను ఎంపిక చేసి కౌలు రైతుల సమస్యపై సర్వే నిర్వహించాలి.
వారి సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎజెండా సెట్టింగ్‌ చేసేందుకు పత్రికల్లో వ్యాసాలు రాయించాలి.
కౌలు రైతుల కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని రైతు సంఘాలు పాల్గొనేలా ఒత్తిడి తేవాలి.
గ్రామ, మండల, జిల్లా కేంద్రాల వారీగా కౌలు రైతుల ఇష్యూస్‌ను తీసుకుని కార్యక్రమాలు చేపట్టాలి.
చివరకు హైదరాబాద్‌లో కౌలు రైతులు తమ గోడును వెళ్లబోసుకునేలా ఒక పబ్లిక్‌ హియరింగ్‌గానీ, ధర్నాగానీ చేపట్టాలి.
2026 మే నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి హక్కులకు రక్షణ కల్పించేలా ఐక్యపోరాటాలు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -