Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌, బీజేపీ అక్రమాలను అడ్డుకుందాం

కాంగ్రెస్‌, బీజేపీ అక్రమాలను అడ్డుకుందాం

- Advertisement -

– సర్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) పేరుతో కాంగ్రెస్‌, బీజేపీల అక్రమాలను అడ్డుకుందామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పిలుపునిచ్చారు. సర్‌పై గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రతి బూత్‌లోనూ ప్రజల ఓట్లను కాపాడాలని కోరారు. అధికార కాంగ్రెస్‌, బీజేపీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రమాదం ఉందనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలన్నారు. త్వరలో తెలంగాణలో జరిగే సర్‌పై దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను బీజేపీ తీసివేసిందన్న ఆరోపణలు విస్తృతంగా తలెత్తుతున్నాయని అన్నారు. దీంతోపాటు మొన్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్‌ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు ఖచ్చితంగా ఈ సర్‌ కార్యక్రమం దుర్వినియోగం చేసే ప్రమాదం రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతోపాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని చెప్పారు.
ఓటు నమోదుపై బీఎల్‌ఏలు ప్రయత్నించాలి
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున నియమించబడే బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ప్రయత్నం చేయాలని కేటీఆర్‌ అన్నారు. సర్‌ మార్గదర్శకాల ప్రకారం బూత్‌ లెవల్‌ అధికారులతో కలిసి సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున బీఎల్‌ఏల నియామకానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బీఎల్‌ఏల ఎంపిక, వారి వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు అందించి వారి నియామకం వెంటనే పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. బీఎల్‌ఏలకు పార్టీ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో సర్‌ వారం. పది రోజుల్లోనే ప్రారంభయయ్యే అవకాశం ఉన్నదనీ, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఓటర్ల జాబితా తయారీ, సవరణ వంటి అంశాలపైన ఇప్పటి నుంచే పార్టీ కసరత్తు చేయాలని సూచించారు. సర్‌ అనేది రానున్న ఎన్నికలకు అత్యంత కీలకమని కేటీఆర్‌ అన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బూత్‌ స్థాయి నుంచి సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. సర్‌పైన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన వివాదాలు, చర్చలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలను, విమర్శలను దృష్టిలో ఉంచుకుని అలాంటి అవకాశం స్థానికంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఇవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా అందరి ఓటు హక్కుని కాపాడుకుంటూ ముందుకు సాగేలా ప్రయత్నం చేయాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -