Sunday, September 6, 2026
E-PAPER
Homeఖమ్మంపామాయిల్‌ రైతులకు అండగా ప్రభుత్వం

పామాయిల్‌ రైతులకు అండగా ప్రభుత్వం

- Advertisement -

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్‌ తోటల విస్తరణతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, డ్రిప్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలోని ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ శబావత్ శంకర్ అధ్యక్షతన పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

పామాయిల్‌ కోత కార్మికుల శ్రమను తగ్గించేందుకు తేలికపాటి ఫైబర్‌ గడలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గతంలో తాటిచెట్లు ఎక్కి కోతలు కోసే కార్మికులు ప్రస్తుతం గడల సహాయంతో పామాయిల్‌ గెలలు కోస్తున్నారని చెప్పారు. యంత్రాల వినియోగానికి అవకాశం ఉన్నా, పంట తోటల్లో అంతర పంటలు సాగు చేయడం వల్ల 90 శాతం వరకు కోత పనులు మాన్యువల్‌గానే చేయాల్సి వస్తోందన్నారు.

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రాధాన్యం
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తుమ్మల పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో చెరువులను నింపేందుకు సీతారామ ప్రాజెక్టు నీటిని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేంసూరు, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయని చెప్పారు.

ప్రధాన కాలువల నుంచి పైప్‌లైన్ల ద్వారా చెరువులకు నీటిని తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీంతో రైతుల భూములకు నష్టం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, చింతూరు ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకొచ్చే పనులకు భూసేకరణ కోసం నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రైతుల భూములకు నష్టం కలగకుండా అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్ల ద్వారా చెరువులకు నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

14 పామాయిల్‌ ఫ్యాక్టరీలు:
తెలంగాణలో పామాయిల్‌ సాగును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతోందని, రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో మరో ఆరు లక్షల ఎకరాల్లో తోటలు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు పామాయిల్‌ ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా, మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మొత్తం 14 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పామాయిల్‌ గెలలు కోసిన 24 గంటల్లోనే ఫ్యాక్టరీలకు చేరేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దేశంలో పామాయిల్‌ సాగులో తెలంగాణను నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కేంద్రం ధరలపై నిర్ణయం తీసుకోవాలి
పామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న పథకంలో చేరితే రైతులకు లభించే ధర తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో సమావేశం నిర్వహించి పామాయిల్‌ రైతుల సమస్యలపై కేంద్రానికి డిమాండ్లు వినిపించనున్నట్లు తెలిపారు.

పామాయిల్‌ సాగుతో పాటు కోకో, జాజి తదితర పంటల్లోనూ రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఏ పంట ద్వారా అధిక ఆదాయం వస్తే ఆ పంటను సాగు చేసి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు.

ఎకరాకు రూ.46 వేల ప్రోత్సాహం:
పామాయిల్‌ మొక్కలు నాటే రైతులకు ఎకరాకు సుమారు రూ.46 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తుమ్మల తెలిపారు. డ్రిప్‌ సౌకర్యం లేకుండా పామాయిల్‌ మొక్కలు నాటితే నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల డ్రిప్‌ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటుతున్న రైతులకు డ్రిప్‌ సబ్సిడీని త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా నాణ్యమైన పామాయిల్‌ మొక్కల సరఫరాలో కొంత ఆలస్యం జరిగిందని, అవసరమైతే ఇతర కంపెనీల నుంచి కూడా మొక్కలు తెప్పించి రైతులకు అందిస్తామని తెలిపారు. రానున్న రెండు, మూడు నెలల్లో తెలంగాణలో పెద్దఎత్తున పామాయిల్‌ తోటలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నీటిని పొదుపుగా వినియోగించాలి:
భూగర్భ జలాలపై ఆధారపడి పామాయిల్‌ తోటలను సాగు చేస్తున్న రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకొని, చెట్టుకు అవసరమైన మేరకే నీరు అందించాలని కోరారు. ప్రస్తుతం నీరు, విద్యుత్‌ అందుబాటులో ఉన్నాయనే కారణంతో అధికంగా నీటిని వినియోగిస్తే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రైతులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, వ్యవసాయంలో గిట్టుబాటు వచ్చే పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంలోనే రైతుకు ఆత్మగౌరవం, సంతృప్తి ఉంటాయని అన్నారు.

రోడ్ల అభివృద్ధికి కృషి:
ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ జరుగుతోందన్నారు. ఏలూరు–భద్రాచలం రహదారి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన అశ్వారావుపేట ప్రాంత అభివృద్ధికి జీవితాంతం కృషి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయం, రహదారులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

– ఆయిల్‌పామ్‌తో రైతులకు సిరులు.. – విస్తరణకు మంత్రి తుమ్మల కృషి అభినందనీయం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
ఆయిల్‌పామ్‌ సాగును రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించి రైతులకు అధిక ఆదాయం అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ రీజినల్‌ కార్యాలయ పరిధిలోని ఆయిల్‌పామ్‌ మొక్కల నర్సరీలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. మొక్కల పంపిణీతో పాటు బిందు సేద్యానికి రాయితీలు, ఎరువులు, సస్యరక్షణ చర్యలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మరింతగా ఆకర్షితులయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం అందించే పంటగా ఆయిల్‌పామ్‌ మారుతోందని, నాణ్యమైన మొక్కలతో పాటు సాగులో సాంకేతిక సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించి ఆయిల్‌పామ్‌ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్‌పామ్‌ గెలల ధర గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం గెలల ధర రూ.24 వేలకుపైగా పలుకుతోందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆయిల్‌పామ్‌ రైతుల్లో నమ్మకం పెరిగిందన్నారు. రైతులకు మెరుగైన ధర లభించేలా కృషి చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆదాయం పెంచే పంటలను ప్రోత్సహించడంతో పాటు సాగుకు అవసరమైన రాయితీలు, ఎరువులు, బిందు సేద్యం, సస్యరక్షణ చర్యలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుల జీవితాల్లో సిరులు కురుస్తున్నాయని అన్నారు.

కార్యక్రమంలో ఆయిల్‌పామ్‌ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ సుంకవల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి,ఓఎస్డీ కిరణ్ కుమార్,పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అశ్వారావుపేట, అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు ఎంఎన్ కార్తీక్,ఎం.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -