– ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభం
– వెయ్యి రోజుల ప్రజా పాలన వేడుకల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం అంకంపాలెం లోని టీజీటీడబ్ల్యుఆర్‌డీసీ బాలికల కళాశాలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ ను తానే ఆదివారం ప్రారంభించారు. వెయ్యి రోజుల ప్రజా పాలన వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అవసరమైన సామగ్రిని అందజేసి వారితో కలిసి భోజనం చేశారు.
రాష్ట్ర, యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థినులకు ఉన్నత స్థాయిలో రాణించేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలో అదనపు తరగతి గదులను త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. విద్యార్థినులు సాధించిన విజయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించి, అధికారులను ఆహ్వానించి వారి ప్రతిభను అభినందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కళాశాలలో సౌర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే కళాశాల ఆవరణలో కోతుల బెడదను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ల గురుమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.



