ప్రధాన కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం నిరాకరణ అప్రజాస్వామికం
కేంద్రానికి అనుకూలమైన వారితో బోర్డు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన
నవ తెలంగాణ – ముషీరాబాద్
కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. ఇది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు మరో నిదర్శనం అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సోమవారం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.కార్మికుల కనీస వేతనాలు, జీవన ప్రమాణాలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే బోర్డులో ప్రధాన కార్మిక సంఘాలను పక్కన పెట్టడం అప్రజాస్వామికమని, కక్షపూరితమైన చర్య అని అన్నారు. 2026 జులై 21న కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన కేంద్ర కనీస వేతన సలహా బోర్డు వాస్తవానికి కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన త్రైపాక్షిక వేదికగా ఉండాలని చెప్పారు. అయితే ప్రధాన కార్మిక సంఘాలను పక్కన పెట్టి, తనకు అనుకూలమైన వారితో బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. తద్వారా కార్మికుల హక్కులను అణచివేయడానికి, యజమానులకు అనుకూలమైన విధానాలను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, కార్మికులకు మాత్రం “ఈజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్” పరిస్థితులను మోడీ ప్రభుత్వం సృష్టిస్తోందని తెలిపారు. కార్మిక కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కనీస వేతనాల నిర్ణయ ప్రక్రియలో కూడా కార్మిక సంఘాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. నిత్యావసర వస్తువులు, ఇంధనం, విద్యుత్, వైద్యం, విద్య, ఇండ్ల అద్దెలు, రవాణా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేసి, కార్మిక కుటుంబాలు గౌరవప్రదంగా జీవించేలా కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించాలని కోరారు.కార్మిక సంఘాల ప్రాతినిధ్యాన్ని తొలగించినంత మాత్రాన కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటం బోర్డుల్లోని ప్రాతినిధ్యంతో ప్రారంభమైంది కాదు, ప్రాతినిధ్యం లేకపోతే ఆగేదీ కాదన్నారు. కర్మాగారాలు, నిర్మాణ, రవాణా, అసంఘటిత రంగాలతోపాటు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల కార్మికులతో కలిసి పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ కార్మికవర్గం, కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి జె. కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, పాలడుగు సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్, సోమన్న, రొయ్యల రాజు, సునీత, నగర కోశాధికారి కె.అజయ్‌బాబు, నగర నాయకులు వికామేష్బాబు, జి.రాములు, జి.నరేష్, ఎం.సత్యనారాయణ, ఎస్.శ్యామ్, లీల, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయూ ప్రాతినిధ్యం తొలగించడం దుర్మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



