బిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు, మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
అచ్చంపేటలో ఫెడరేషన్ 2 దశాబ్దాల ఉత్సవాలు
నవతెలంగాణ-అచ్చంపేట
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా (బిఎస్ఎఫ్ ) బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నామని బిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం అచ్చంపేటలో జిల్లా అధ్యక్షులు మద్దెల బండ సాయిబాబు ఆధ్వర్యంలో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రెండు దశాబ్దాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
టీఎన్జీవో భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకుని గత 20 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు చేసినట్లుగా ఎంతోమంది నాయకులను ఈ సంఘం తయారు చేసిందని, నవ యువకులను తీర్చిదిద్దుతుందని తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేస్తుందని విద్యార్థులకు సంఘం నాయకులకు దిశా నిర్దేశం ఇచ్చారు. విద్యార్థులు దేశానికి వెన్నెముకని శ్రద్ధతో చదువుకుని ఉద్యోగస్తులుగా, నాయకులుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని సమాంతరంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని నిరంతరం మహనీయులను స్మరించుకోవాలని తెలిపారు.
బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు వెన్నంటి ఉంటామని రాష్ట్రవ్యాప్తంగా సంఘ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పెడచెవిన పెడుతుందని, ఫీజుల బకాయిలు చెల్లించకుండా మొండికేస్తుందని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకగా బిఎస్ఎఫ్ ముందు వరుసలో ఉంటుందన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాబూబ్ నగర్ ప్రాంత అధ్యక్షులుగా మద్దెలబండ సాయిబాబును, అచ్చంపేట నియోజకవర్గం అధ్యక్షులుగా కాంపల్లి ఆంజనేయులు, అచ్చంపేట పట్టణ అధ్యక్షులుగా మనీష్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నరేందర్, కళాకారుడు గుడిపల్లి శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.



