– బీజేపీ ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం
నవతెలంగాణ – రాయపోల్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పీఠం గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తాత మధుపై సభ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సభాపతి పీఠాన్ని ప్రతి ప్రజాప్రతినిధి గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినా, వ్యక్తిగతంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సభ మర్యాదలకు విరుద్ధమని పేర్కొన్నారు.
తాత మధు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించి, సభ నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే సస్పెన్షన్‌తో పాటు నిబంధనల ప్రకారం బర్తరఫ్ చర్యలను కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలు, సభ సంప్రదాయాలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గజ్వేల్ రామచంద్రం సూచించారు.



