ఆవేశం మీకు కాదు.. నాకుండాలి
హరీశ్‌రావుపై స్పీకర్ ఆగ్రహం
మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సమాధానం
చెప్పాలన్న బీఆర్ఎస్
ఘటనపై పూర్తి నివేదిక కోరామన్న శ్రీధర్ బాబు
నివేదిక వచ్చిన తర్వాత చర్యలుంటాయన్న స్పీకర్
స్పీకర్ పై వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్
స్పీకర్ అంటే తమకు చాలా గౌరవం ఉందన్న హరీశ్ రావు
తాతా మధు స్పీకర్ ను ఉద్దేశించి అలా మాట్లాడలేదు
స్పీకర్ అలా భావిస్తే విచారం వ్యక్తం చేస్తున్నామన్న హరీశ్
పోలీసులపై కేటీఆర్ దాడి చేశారన్న మంత్రి సీతక్క
ఈ వివాదాలను ఇంతటితో
ఆపాలన్న ఏలేటి
శాసన సభలోవాడీ వేడి చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఉదయం జరిగిన ఘటనలపై మంగళవారం కూడా సభలో వాగ్యుద్ధం జరిగింది. ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి అంటూ..ఒక దశలో స్పీకర్ ప్రసాద్‌కుమార్.. హరీశ్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ సభ్యులు హాజరయ్యారు. సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని అవమానించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. తిరిగి వారిపైనే అక్రమ కేసులు పెట్టారని ఆవేశంగా మాట్లాడారు. రాష్ట్రంలోని యావత్ మహిళలపై జరిగిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నామన్నారు. ‘‘ కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరవ సభ.. కౌరవ సభగా మారింది. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు.. కాంగ్రెస్ పార్టీకి పడుతుంది’’ అని తీవ్రంగా విమర్శించారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని.. హరీశ్‌రావు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ‘‘మహిళా సభ్యులంటే సభతో పాటు నాకు కూడా గౌరవం ఉంది. మీరు చెబితే నేను వినట్లేదా.. ఎందుకంత ఆవేశం. మీకు కాదు ఆవేశం.. నాకు ఉండాలి. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి పట్ల తనకు కూడా గౌరవం ఉందన్నారు. నాకున్న ఎనిమిది మంది అక్కా చెల్లెళ్లతో పాటు వారు కూడా తన సోదరీమణులేనని పేర్కొన్నారు. మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తనకు సంబంధించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టంచేశారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… మహిళా సభ్యులపై జరిగిన ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని స్పీకర్ పోలీసులను ఆదేశించారని వివరించారు. మహిళల పట్ల గౌరవం మాకూ ఉందన్నారు. తప్పు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. స్పీకర్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సభను ఎలా నడపాలనే అంశంపై బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరు..?అని ప్రశ్నించారు. అనుకుంటే.. భావిస్తే ఏంటి.. వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా?అని హరీశ్‌రావును ఉద్దేశించి ప్రశ్నించారు… మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు.. స్పీకర్‌పై జరిగినదాన్ని పక్కనపెట్టాలని చెప్పటంతోనే ఆ ఘటనను వీరు ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో అర్థమవుతుందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పాల్సిన అవసరమేంటని బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ గేట్ దగ్గర మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టింది ఎవరూ.. మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పింది ఎవరని ప్రశ్నించారు. స్పీకర్‌ను ఆయన తల్లిని దూషించి ఇప్పుడు లేదని దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై దాడులు చేయడం సబబేనా అనినిలదీశారు. అసెంబ్లీలో రూల్ తెచ్చిందే మీరు.. మీరే పాటించరా అని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లకారం భాషతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, తమ చీర లాగారు.. కొట్టారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. నిజంగా మహిళా సభ్యులపై దాడి జరిగితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా కేసులు పెడతామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్పీకర్‌ను అవమానిస్తే సహించబోమన్నారు. ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆ వ్యాఖ్యలపట్ల వారికి కనీస పశ్చాత్తాపమే లేదన్నారు. స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు మాకు కూడా సోదరీమణులే.. వారిపై దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించమని చెప్పారు. ఒకవైపు మహిళలపై జరిగిన ఘటనపై విచారణ కోరుతూ.. మరోవైపు స్పీకర్‌పై వ్యాఖ్యలను సమర్థించడం ఏ న్యాయం?అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల ప్రజలు కూడా ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందా?అని ప్రశ్నించారు. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు స్పీకర్‌పై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయని గుర్తు చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే అనురిద్రెడ్డి మాట్లాడారు.
బీజేపీ సభ్యులు 22ఏపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రజా సమస్యలు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం ముందు బైటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని ఆ అంశంపై ప్రత్యేక చర్చ ఉందని చెప్పారు. వారు, వీరు కలిసి లోపాయికారి ఒప్పందంతో స్పీకర్‌పై జరిగిన దాడిని పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ సభ్యులును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



