Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతాతా మధు, నవీన్‌‌రెడ్డిలకు ఊరట

తాతా మధు, నవీన్‌‌రెడ్డిలకు ఊరట

- Advertisement -


రిమాండుకు నాంపల్లి కోర్టు తిరస్కరణ
స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు
నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

అసెంబ్లీ స్పీకర్ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారిని జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపించడానికి ‌నాంపల్లి కోర్టు నిరాకరించింది. దీంతో వారికి ఊరట లభించింది. కోర్టు ఆదేశంతో వారిని పోలీసులు విడుదల చేశారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్‌‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దుమారం జరిగిన విషయం తెలిసిం‌దే. వారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఇద్దరు ఎమ్మెల్సీలను హైదరాబాద్‌‌లోని ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. అక్కడికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారిని ఆ ఉదయమే కింగ్‌ ‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలను చేయించారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలను న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరు పరిచారు. అయితే వారిని కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఆ మేరకు నాంపల్లిలోని ఒకటో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు ఉదయం 11 గంటల ప్రాంతంలో తీసుకెళ్లి వారిని హాజరు పరిచారు. కోర్టులో వారిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా ‌వారు స్పీకర్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదనీ, అక్రమంగా కేసును బనయించారంటూ ఎమ్మెల్సీల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. వారి ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను జ్యుడీషియల్ రిమాండ్‌‌కు పంపించడానికి నిరాకరించారు. వారు ఇరువురు రూ.పదివేల చొప్పున పూచీకత్తులు చెల్లించాలని ఆదేశించారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలను పోలీసులు విడుదల చేశారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. ఆరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తాతా మధు, నవీన్ రెడ్డిలను న్యాయమూర్తి ఆదేశించారు.

న్యాయం గెలిచింది : తాతా మధు
కోర్టు వెలుపలికి వచ్చాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు మీడియాతో మాట్లాడుతూ అంతిమంగా న్యాయమే గెలిచిందని అన్నారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తాను స్పీకర్‌‌నుద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఈ విషయం చెప్పినా తనపై ఉద్దేశపూర్వకంగా కేసును బనాయించారని ఆరోపించారు. తనతోపాటు నవీన్‌ ‌రెడ్డిని జైలుకు పంపాలన్న కుట్ర ఫలించలేదని అన్నారు. భవిష్యత్‌ అంతా బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని చెప్పారు. కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. తమ న్యాయవాదులు, కేసీఆర్ కేటీఆర్‌‌లకు ధన్యవాదాలు చెప్పారు.

పోలీసులతో న్యాయవాదుల వాగ్వాదం
​నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ న్యాయవాదులు, నారాయణగూడ పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ ఎస్సై నోరు జారడంతో ఈ వివాదం మొదలైంది. నాంపల్లి కోర్టు ఖాళీ చేసి వెళ్లాలని మీడియా ప్రతినిధులకు అదే ఎస్‌ఐ హుకుం జారీ చేశారు. మీడియాకు మద్దతుగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -