మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుని వెంటనే బర్తరఫ్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల బీఆర్ఎస్‌కున్న అమర్యాదకరమైన వైఖరితోపాటు దళితుల పట్ల ఆ పార్టీ నాయకుల్లో నెలకొన్న చిన్నచూపును మరోసారి బయటపెట్టాయని తెలిపారు. దళిత స్పీకర్‌ను అవమానించిన తాత మధును బీఆర్ఎస్ పార్టీ నుంచీ, ఎమ్మెల్సీ పదవి నుంచీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తాత మధు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి.రేఖ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు శంభుల ఉషాశ్రీ, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు కవిత, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆర్. లక్ష్మి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాత మధును బర్తరఫ్ చేయాలి : ఎర్రబెల్లి స్వర్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



