Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

- Advertisement -

హామీ మేరకు రూ.18 వేల వేతనాన్ని వెంటనే నిర్ణయించాలి : సీపీఐ(ఎం)
ఆశావర్కర్ల అరెస్టులను ఖండించిన సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ వచ్చిన వేలాది మంది ‘ఆశా’ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని, రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని ‌సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్. రమను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా, ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి . జయలక్ష్మి, రాష్ట్ర నాయకులు జె. వెంకటేష్‌తో పాటు వందలాది మందికి పైగా ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యకు నిదర్శనమని విమర్శించారు. పోలీసుల అత్యుత్సాహపూరిత దాడితో ఆశా వర్కర్లు గాయపడ్డారనీ, కొందరు స్పృహతప్పి పడిపోయారని వాపోయారు. ఈ అణచివేతను నిరసిస్తూ మండల కేంద్రాల్లో బుధవారం జరిగే నిరసనలకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించడంతో పాటు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.
అక్రమ అరెస్టులు దుర్మార్గం : సీఐటీయూ
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని హైదరాబాద్ ధర్నాకు తరలివచ్చే క్రమంలో ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌పేర్కొన్నారు. దీన్ని ప్రజా సంఘాలు, ప్రజా తంత్రవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ధర్నా అనుమతి కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులు చేయడమేనా? అని ప్రశ్నించారు. ఎన్నిక సందర్భంగా ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఆశావర్కర్లకు రేవంత్‌‌రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -