Wednesday, September 9, 2026
E-PAPER

సభాపర్వం

- Advertisement -

ముఖ్యమంత్రి భాష చూసి సమాజం నవ్వుకుంటోంది : పాడి కౌశిక్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో

​ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాసనసభ్యులను అవమానించేలా ‘బడవే’ అంటూ తీవ్రమైన బూతులు మాట్లాడారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టుల బట్టలిప్పి కొడతామన్న వారిపై, కత్తులతో కోలాటం ఆడుతామన్న కాంగ్రెస్ నేతలపై చర్యలు ఉండవా? నీతి లేని వారికి ఎథిక్స్ కమిటీ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా పాయింట్‌ ‌వద్ద మాట్లాడారు. సభా నాయకుడికే ఎథిక్స్ లేవని, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు జుట్టు, చీర పట్టి లాగారని గుర్తుచేశారు. ప్రభుత్వం వారికి బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత దళితబంధు నిధులను వెనక్కి తీసుకుంటోందన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా అని సవాల్‌ ‌విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్‌లో రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆయన గెలిస్తే నేనే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు.

​నడుస్తున్నది సర్కార్ కాదు.. సర్కస్: 
డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్
మహిళా ఎమ్మెల్యేల వద్దకు మగ పోలీసులను, పురుష ఎమ్మెల్యేల వద్దకు మహిళా పోలీసులను పంపి అసభ్యంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగిన పోలీసుల ఫొటోలు తమ వద్ద ఉన్నాయి, ఎవరినీ వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. డీసీపీ శిల్పవల్లి సంస్కారం ఎక్కడికి పోయింది?.. సీఎం అసభ్య భాష వల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు. కోటి ఎకరాల భూమిని 22ఏలో పెట్టి రైతులను వేధిస్తున్నారని, యూరియా కొరత, 9 గంటల కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, బీడీ కార్మికుల పెన్షన్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అసెంబ్లీని కనీసం నెల రోజులపాటు నడపాలన్నారు.

​కేసీఆర్ చావు కోరుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్‌ది.. : వేముల ప్రశాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి అనేకసార్లు కేసీఆర్ చావు గురించి మాట్లాడారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, వేముల వీరేశం బహిరంగంగా కేసీఆర్ ఇంటిపై దాడులు చేస్తామని, ఆయన చావు కోరుకుంటున్నామని మాట్లాడటం కాంగ్రెస్‌ ‌నీచ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. డీజీపీ తక్షణమే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేశారని సమాచారం ఉందని, రేవంత్ రెడ్డి మొగోడైతే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ఈ తీరుపై తెలంగాణ సమాజానికి సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
​వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..: 
జి. జగదీశ్ రెడ్డి
ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకే ‘భూభారతి’ తెచ్చారని, దీనిపై చర్చ జరిగితే తమ దోపిడీ బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే జి.జగదీశ్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నివాసంపైకి గూండాలను, రౌడీలను పోలీసు ఎస్కార్ట్‌తో పంపిస్తున్నారని, ‘తొక్కి పడేయండి’ అని సీఎం ఆదేశాలు ఇస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు సహకరిస్తున్న పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోలని, భవిష్యత్‌లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

​విపక్షాల గొంతు నొక్కుతున్నారు : బీఆర్‌ఎస్‌ ‌ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కోవా లక్ష్మి
వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సభలో సంబంధం లేని అంశాలు తెచ్చి ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వివరణ అడిగితే విపక్షాలకు మైక్ ఇవ్వడం లేదన్నారు. మంత్రి సీతక్క మహిళలను అవమానించేలా మాట్లాడారని, తాతా మధు క్షమాపణలు చెప్పినా కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావు కోరుకోవడం కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. పరిపాలన చేతకాకపోతే సీఎం పదవి నుంచి తప్పుకోండి, కేసీఆర్ పాలించి చూపిస్తారని వారు హెచ్చరించారు.
​తప్పుడు ప్రచారాలు: ‌ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
బీఆర్ఎస్ నేతలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెరలేపారని ప్రభుత్వ విప్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న ఓ దళిత పోలీసు అధికారి తల్లిని కించపరిచేలా దుర్భాషలాడారని.. వారి వ్యాఖ్యలతో గౌరవ స్పీకర్ సభలోనే కంటతడి పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కేసీఆర్‌కు దళితులపై ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు. పదేండ్ల పాలనలో క్యాబినెట్‌లో దళితులకు సముచిత స్థానం ఇవ్వలేదని, పైగా వారి భూములను గుంజుకున్నారని అన్నారు. ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశాక కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే దళితబంధు తెచ్చారని, బీఆర్ఎస్ మహిళా నేతలు మహానటి సావిత్రి కంటే ఎక్కువ నటిస్తున్నారని విమర్శించారు. సోమవారం ఘటనపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వారి సభ్యుల తరఫున క్షమాపణ చెప్పాలన్నారు.

​మహిళా పోలీసుల ఎదుట చొక్కాలు విప్పుతారా?: ఎమ్మెల్సీ, విప్ బల్మూరి వెంకట్
మహిళా పోలీసు అధికారుల ఎదుట చొక్కాలు విప్పి బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇలాంటి సంస్కారహీనమైన పనులు చేయడమా మీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నేర్పింది అని ప్రశ్నించారు. వారి ఎమ్మెల్యేల తప్పులను కేటీఆర్, హరీశ్‌‌రావు సమర్థిస్తూ వెనుకేసుకొస్తున్నారన్నారు. దళిత సమాజాన్ని అవమానించేలా వ్యవహరిస్తూ, స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
​నిన్న కట్లు.. నేడు గాయాలు మాయం: 
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సోమవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ఇప్పటివరకు కేసీఆర్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. నిన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒళ్లంతా కట్లు కట్టించుకుని నాటకమాడారు.. తీరా ఈరోజు చూస్తే ఆయనకు ఎలాంటి గాయమూ లేదన్నారు. ప్రజల సానుభూతి పొందడానికి ఇలాంటి చౌకబారు డ్రామాలు ఆడుతున్నారని, శాంతిభద్రతలను కాపాడే పోలీసులను నెట్టివేసి దురుసుగా ప్రవర్తించింది బీఆర్ఎస్ నేతలే అని చెప్పారు. కేసీఆర్ వెంటనే సభకు వచ్చి గౌరవ స్పీకర్ కి క్షమాపణ చెప్పాలన్నారు.

అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్‌లో అల్లర్లు: ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్
పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అరాచకాలు, అక్రమాలు, అవినీతిమయం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు అధికారం కోల్పోయామన్న ఫ్రస్ట్రేషన్‌లో ఉద్దేశపూర్వకంగా అల్లర్లను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి దిగి, ఎదురుదాడి జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దళిత సామాజిక తరగతి స్పీకర్ పై దురుసుగా మాట్లాడి రాజ్యాంగ వ్యవస్థలను అవమానించిన తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందేనన్నారు.
​కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు : బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్
తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ‘నువ్వు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్టు చేస్తా’ అన్నట్టుగా ఇరు పార్టీలు వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. పేద ప్రజల భూములను 22`ఏ పరిధిలోకి చేర్చి అన్యాయం చేస్తున్నారన్నారు. దీని వెనుక పెద్ద భూదోపిడీ దాగి ఉందన్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ పెండింగ్ అంశాలు, రైతాంగ సమస్యలపై చర్చ జరగకుండా రెండు పార్టీలు సభ సమయాన్ని వృథా చేస్తున్నాయని, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలపై ఎందుకు చర్చించడం లేదు అని ప్రశ్నించారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

​సస్పెండ్ చేయడం కాదు,
 సభ్యత్వం రద్దు చేయాలి: అద్దంకి
ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరించిందని ఎమ్మెల్సీ, విప్‌ అద్దంకి దయాక్‌ ‌తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మిడియాపాయింట్‌ ‌వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు స్పీకర్ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరు నుప్రజలు గమనించారన్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన సభా సభ్యున్ని సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేసిన సంక్షేమం సహించలేక కేసీఆర్ ఇలాంటి కుట్రలకు తెరలేపారన్నారు. సభ్యున్ని సస్పెండ్ చేయడం కాదు, సభా సభ్యత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడు చేసిన దగుల్బాజీ పనికి కేసీఆర్ స్వయంగా సభకు వచ్చి క్షమాపణ కోరాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రతిపక్ష హోదా అంటే ఇంట్లో పడుకోవడమా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌ రావు చాలు.. వారి పార్టీని వారే బొంద పెట్టడానికన్నారు.
​ దళిత, గిరిజనులకు అవమానాలు : 
ప్రభుత్వ విప్‌ ‌రాంచంద్రనాయక్‌
‌పదేండ్లలో దళిత, గిరిజనులకు అవమానాలు మిగిల్చారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ‌రాంచంద్రనాయక్‌ అన్నారు. దళిత, గిరిజన వ్యతిరేకి కేసీఆర్ కుటుంబమని, మహిళలను రాజకీయ పావులుగా మాత్రమే వాడుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యల మీద చర్చ జరపకుండా, బామ్మర్ది బావ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. శాసన సభలో, మండలిలో వారిపై చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -