Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసులపై చర్యల ఉత్తర్వుల్ని రద్దు చేయండి

పోలీసులపై చర్యల ఉత్తర్వుల్ని రద్దు చేయండి

- Advertisement -

ప్రభుత్వం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లంచ్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌ను దాఖలు చేసింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ‘మహిళా ఎమ్మెల్యేలపై గౌరవం ఇదేనా?’ అని ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేలను గెంటివేస్తున్న ఫొటోలు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. మరో ఎమ్మెల్యే కంటతడి పెట్టినట్లుగా ఉన్నాయంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలున్న నల్ల టీషర్ట్‌ ధరించారని అడ్డుకున్నామని చెబుతున్న పోలీసులు, స్లోగన్స్‌ లేని తెల్ల చొక్కా వేసుకున్న ఎమ్మెల్సీ మధుసూధనాచారి, చీరలు ధరించిన ఎమ్మెల్యేలు సబిత, సునీతలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ ‌జనరల్‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోలేదనీ, నల్ల టీషర్టులు ధరించారనే కారణంతోనే ఆపారని తెలిపారు. అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయనీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీషర్టులు ధరించి సమూహంగా రావడం అసెంబ్లీ బులిటెన్‌ 34, రూల్‌ 316కు విరుద్ధమని తెలిపారు. చీఫ్‌ మార్షల్‌ కోరడంతో, స్పీకర్‌ ఆదేశాల మేరకే పోలీసులు సాయం అందించారనీ, భద్రతా వలయాన్ని ఎమ్మెల్యేలు ఛేదించే ప్రయత్నంలో తోపులాట జరిగిందని, పోలీసులకు కూడా గాయాలయ్యాయని చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి, ఎడిట్‌ చేయని వీడియోను పరిశీలించాలని కోరారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న మధ్యంతర ఉత్తర్వుల్లోని చివరి రెండు పేరాలను తొలగించాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ గండ్ర మోహన్‌‌రావు వాదిస్తూ.. సభా నిబంధనల ఉల్లంఘనపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందనీ, ఆ అధికారాన్ని పోలీసులు చేపడితే పోలీసు రాజ్యానికి దారితీస్తుందని ఆందోళనను వ్యక్తం చేశారు. బులెటిన్‌-34‌లో నల్ల టీషర్టులు ధరించరాదని ఎక్కడా లేదనీ, నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో స్పీకరే నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. నల్ల టీషర్టులు ధరించని మహిళా ఎమ్మెల్యేలను, నినాదాలు లేని తెల్లచొక్కా ధరించిన ఎమ్మెల్సీని ఎందుకు అడ్డుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేను మెడ పట్టుకుని నెట్టినట్లు, మరో మహిళా ఎమ్మెల్యే చీర పట్టుకుని లాగినట్లు కనిపిస్తున్న ఫొటోలపై ఆరా తీసింది. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగింది. సభ్యుల ప్రవేశానికి సంబంధించి కొత్త నిబంధనలు విధించారా? వాటిని ముందుగానే తెలిపారా? సభా నిబంధనలను అమలు చేసే అధికారం స్పీకర్‌కు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే అధికారం ఎక్కడిది? ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందున తక్షణ ఉత్తర్వులు అవసరం లేదనీ, అఫిడవిట్లు, ఫొటోలు, వీడియోలు, ఎఫ్‌ఐఆర్, స్పీకర్‌ ఆదేశాలు, చీఫ్‌ మార్షల్‌ పాత్ర, నిషేధాజ్ఞలు, అసెంబ్లీ నిబంధనలు తదితర రికార్డులను పరిశీలించిన అనంతరం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -