Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి బొగ్గు 90 శాతం తెలంగాణకే

సింగరేణి బొగ్గు 90 శాతం తెలంగాణకే

- Advertisement -

ఆగస్టులో విద్యుత్ రంగానికి 40.51 లక్షల టన్నులు
అందులో రాష్ర్టానికి 36.26 లక్షలు
దేశవ్యాప్త వినతులు కాదని స్థానిక అవసరాలకే కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌

సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీ విద్యుత్‌ ‌రంగానికి సరఫరా చేస్తున్న బొగ్గులో 90 శాతం తెలంగాణకే కేటాయిస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల నుంచి బొగ్గు కోసం వస్తున్న వినతులను కాదని స్థానిక అవసరాలకు సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది.
​ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోంది. కీలక సమయాల్లో విద్యుత్ రంగానికి అండగా నిలుస్తూ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా నిలుస్తోంది. నాణ్యమైన బొగ్గును సకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయటం కోసం సంస్థ అయిదుగురు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ కోసం నియమించింది.
​సింగరేణి సంస్థ తాను ఉత్పత్తి చేసిన బొగ్గును దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలు విద్యుత్ సంస్థలకు దశాబ్దాలుగా బొగ్గు రవాణా చేస్తూ ఆయా రాష్ట్రాల ఇంధన అవసరాలను తీరుస్తోంది.
అయితే దేశంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ విద్యుత్ అవసరాలకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యుత్ రంగానికి సరఫరా చేస్తున్న ప్రతీ పది టన్నుల బొగ్గులో దాదాపు తొమ్మిది టన్నులు తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకే చేరుతుండటం విశేషం. ఆగ‌స్టులో సింగ‌రేణి 40,51,312 ట‌న్నుల బొగ్గును దేశంలోని విద్యుత్ సంస్థ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌గా, అందులో 36,25,937 ట‌న్నుల బొగ్గును తెలంగాణ‌లో ఉన్న విద్యుత్ సంస్థ‌ల‌కు ర‌వాణా చేయ‌డం జ‌రిగింది.

అత్య‌ధికంగా టీజీ జెన్కోకు….
గత నెలలో కొత్తగూడెం థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రానికి 6,99,661 ట‌న్నులు,
యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి 7,99,017 ట‌న్నులు,
భూపాలపల్లి లోని కాకతీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌ ప్లాంట్ కు 1,02,959 టన్నుల బొగ్గును టీజీ జెన్కోకు రవాణా చేయడం జరిగింది.
మొత్తంగా ఒక్క నెలలోనే 20,16,356 టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ రవాణా చేసింది.
అలాగే రాష్ట్ర ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చుతున్న రామ‌గుండం ఎన్టీపీసీకి 7,28,164 ట‌న్నులు,
సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (జైపూర్‌)కు 4,65,579 ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.

ఇతర రాష్ట్రాల విన‌తులు…
విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు నిరంతర సరఫరా కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి బొగ్గుకు ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. కొన్నేండ్లుగా సింగ‌రేణికి వినియోగ‌దారుగా ఉన్న‌ ప‌శ్చిమ‌బెంగాల్ లోని దామోద‌ర వ్యాలీ కార్పోరేష‌న్‌ డీవీసీ నుంచి ఒక మిలియ‌న్ ట‌న్ను, దుర్గాపూర్ లోని ఎన్ టీ ఈసీఎల్ నుంచి 1.2 మిలియ‌న్ ట‌న్నులు, ఎన్‌ఎస్‌పీసీఎల్- (అరావళి) నుంచి 1 మిలియ‌న్ ట‌న్ను, త‌మిళ‌నాడులోని ఎన్‌టీఈసీఎల్ నుంచి 2 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు సరఫరా చేయాలని వినతులు వచ్చాయి. బొగ్గు డిమాండ్‌‌ను వ్యాపారాత్మకంగా మలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల డిమాండ్లను పక్కకు పెట్టి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తుంది.

ఒడిశాలోని నైనీ బొగ్గు……
ఒడిశాలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తిని ప్రారంభించిన నైనీ బొగ్గు గ‌ని నుంచి కూడా బొగ్గును స్వ‌రాష్ట్రానికి త‌ర‌లిస్తోంది. ఇప్ప‌టికే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి, యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి స‌ర‌ఫ‌రా చేసింది. ర‌వాణా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ రానున్న రోజుల్లోనూ మరింత బొగ్గు స‌ర‌ఫ‌రా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నైనీలో ప్రస్తుతం 15 ల‌క్ష‌ల టన్నుల బొగ్గు వెలికితీయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ… కేవ‌లం రాత్రి వేళ‌లో మాత్ర‌మే అక్క‌డ బొగ్గును రైల్వే సైడింగ్ వ‌ర‌కు ర‌వాణా చేయ‌డానికి అనుమ‌తి ఉన్నందున ఎక్కువ ప‌రిమాణంలో బొగ్గు స‌ర‌ఫ‌రాను పెంచ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయినప్ప‌టికీ ఉత్పత్తి చేస్తున్న నైనీ బొగ్గును కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వినియోగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -