Sunday, April 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ కుట్రలను దేశం తిప్పికొట్టింది

బీజేపీ కుట్రలను దేశం తిప్పికొట్టింది

- Advertisement -

దక్షిణాదికి అన్యాయం జరిగితే తెలంగాణ తరహాలో మరో ఉద్యమం
మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి..అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆత్మగౌరవ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి గట్టెక్కేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలను దేశం తిప్పికొట్టిందని వక్తలు అన్నారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్‌ వీగిపోయిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆత్మగౌరవ సభకు వారు హాజరై మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదనే విషయం మరోసారీ పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందన్నారు. గత ఎన్నికల నుంచి ఆ పార్టీ బలహీన పడుతున్న నేపథ్యంలో బలమైన ప్రాంతాల్లో సీట్లను పెంచుకుని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే డీలిమిటేషన్‌ అని అన్నారు. ఆ పార్టీ తన స్వార్థం కోసం చేస్తున్న చర్యలకు దక్షిణాది తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. గతంలోనూ ఉపాధి హామీ, కార్మిక చట్టాల మార్పు, రైతు విత్తన బిల్లు, అటవీ హక్కులు, విద్యుత్‌ సవరణ లాంటి అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను అక్రమంగా తెచ్చిందని విమర్శించారు. బీజేపీకి ప్రజల ప్రయోజనం ముఖ్యం కాదనీ, అధికారం నిలబెట్టుకోవడమే ముఖ్యమని అన్నారు. ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా పోరాటం చేసి కాషాయం పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజరేషన్ల బిల్లును ప్రత్యేకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెడితే సీపీఐ(ఎం)తో పాటు విపక్షాలన్నీ మద్దతిస్తాయని జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. బీజేపీ కర్నాటక ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ జాతి వైరుధ్యాలు, సమగ్రతకు విఘాతం కల్గించే బీజేపీ కుతంత్రాలను పౌరసమాజం అడ్డుకోవాలని పిలుపుని చ్చారు. ఆ పార్టీ ప్రతిపాదిత డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది ప్రజలు రెండో తరగతి పౌరులుగా మారుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిం చిన హైబ్రీడ్‌ పునర్విభజనపై చర్చ హోల్డర్లతో చర్చించకుండా ఎలా ముందుకెళ్తారని నిలదీశారు. జనాభా, జీడీపీలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దక్షిణాది ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా ముందుకెళ్తే తెలంగాణ తరహా మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన తేజస్వీసూర్యను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలకు పౌరుషం ఉంటే వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలన్నారు. బీజేపీ బానిసల జనతా పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు మోడీ సర్కార్‌ చేసిన కుట్ర వీగిపోయిందన్నారు. సమైఖ్యంగా నిలబడితే ప్రజాస్వామ్య స్ఫూర్తితో గెలవవచ్చని నిరూపితమైందని గుర్తు చేశారు. తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎత్తుగడగా వాడుకోవడం శోచనీయమన్నారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ నిర్ణయాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగానికి లోబడి తెలంగాణ ఏర్పాటైందనీ, ఈ ప్రక్రియకు అప్పటి బీజేపీ పార్లమెంట్‌ సభ్యులందరూ మద్దతిచ్చారని గుర్తు చేశారు. కనీస అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టి డీలిమిటేషన్‌ బిల్లును తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. సీపీఐ పార్లమెంట్‌ సభ్యురాలు గీతాముఖర్జీ సిఫారసులతో 2023లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. కొత్తగా తేవాల్సిన అవసరం లేదన్నారు. దాన్నే అమలు చేయాల్సింది పోయి డీలిమిటేషన్‌ పేరుతో బీజేపీ రాజకీయ చేస్తోందని విమర్శించారు. దక్షిణాదికి ఇంత ఉపద్రవం వస్తున్నా చంద్రబాబు, జగన్‌ ఎన్డీఏకు వంతపాడటం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ సమాఖ్య కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య వర్గ సభ్యులు శ్రీరాంనాయక్‌, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శి ఈటీ నర్సింహ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్‌ విమలక్క, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్దన్‌, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -