ఒకరికి జీవితం
సంపూర్ణంగా వికసించిన పుష్పం —
రోజూ అందాన్ని ఖర్చుపెట్టుకుంటూ వాడి రాలిపోవడమే…
సువాసనగా గాలిలో కలిసిపోతూ
రంగుగా కళ్లలో మిగిలిపోతూ
స్కృతిగా మనసుల్లో నిలిచిపోతూ
చివరికి ఖాళీ కొమ్మగా మారిపోవడమే జీవితం…
మరికొందరికి జీవితం
తోకకు దారం కట్టిన గాజు రెక్కల తుమ్మెద
ఎగురుతున్నాం అనుకుంటారు
కానీ ఎవరి వేళ్ల మధ్యనో వారి ఆకాశం ముడివేసి ఉంటుంది
దారం పొడవే వారి ప్రపంచం అవుతుంది
దారం తెగుతుందనే ఆశతో కాదు
తెగిపోదేమో అనే ఆందోళనతోనే ఎక్కువగా జీవిస్తున్నారు
ఎందుకంటే దారం తెగితే
ఒక క్షణమే స్వేచ్ఛ తర్వాత తెలియనితనం…
దారం తెగకపోతే జీవితం అంతా
పరిమిత ఆకాశంలోనే ఎగిరినట్టు నటించాలి
ఒక పుష్పం వాడిపడేలోపే
ఒక తుమ్మెద దారం పొడవంత ఆకాశంలోకి ఎగిరింది
సాయంత్రానికి పుష్పం నేలపై పడింది
తుమ్మెద ఇంకా గాల్లో తిప్పలు పడుతూనే ఉంది
పూవు దానిపై వాలాలనుకొనే తుమ్మెద
రెండూ జీవితాలే…
- మువ్వా శ్రీనివాసరావు

