Monday, April 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆ ఇద్దరి పేర్లూ ఆమోదించండి

ఆ ఇద్దరి పేర్లూ ఆమోదించండి

- Advertisement -

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై సీఎం రేవంత్‌రెడ్డి
లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీి సందర్భంగా విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజహరుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్లను ఆమోదించాలని సీఎం రేవంత్‌ రెడ్డి… రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిసి విన్నవించారు. ప్రస్తుతం అసెంబ్లీ, మండలి.. ఏ సభలోనూ అజహరుద్దీన్‌ సభ్యుడిగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వెంటనే ఆమోదించాలని సీఎం… గవర్నర్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆయన మంత్రి పదవిని చేపట్టి ఈ నెలాఖరుకు ఆర్నెల్లు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపే ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నుకోబడాలి లేదంటే నియమించబడాలి. కానీ అజహరుద్దీన్‌ విషయంలో ఈ రెండూ జరగలేదు. అందువల్లే సీఎం అత్యవసరంగా గవర్నర్‌తో భేటీ అయినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కూడా ఇదే విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. ఒకవేళ సీఎం చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ తోసిపుచ్చితే ఈనెల 30 తర్వాత అజహరుద్దీన్‌ తన మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. శుక్లాతో భేటీ సందర్భంగా విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు సీఎంవో పేర్కొంది. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్‌ ఈ సందర్భంగా సూచించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లోక్‌ భవన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 12న ఎల్బీస్టేడియంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామనే విధంగా విద్యార్థుల నుంచి ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్‌ కోరారు. ఆయన చేసిన సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌ బాబు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -