– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
– గంగారంలో అయిలమ్మ 41వ వర్ధంతి
నవతెలంగాణ-సత్తుపల్లి
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గురువారం సత్తుపల్లి మండలం గంగారంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో ఐలమ్మ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. భూమి కోసం, పేదల హక్కుల కోసం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ, అన్యాయాలను ఎదిరించి ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
నేటికీ పేద ప్రజలు భూమి, ఇండ్లు, ఉపాధి, సమాన హక్కుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఐలమ్మ చూపిన ధైర్యం, త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు కువ్వారపు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు హసావత్ కృష్ణ, బండి వేలాద్రి, తడికమళ్ల రామకృష్ణ, బెజవాడ లక్ష్మీనారాయణ, దేవళ్ల రామారావు, ఆంగోతు చిట్టెమ్మ, కొలికిపోగు రత్తయ్య, గుంటూరు జయరాజు, రఘు, రాంబాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



