– ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దయానంద్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రీయ రహదారిపై ఉన్న ఐలమ్మ విగ్రహానికి డాక్టర్ దయానంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి వేడుకలో డాక్టర్ దయానంద్ మాట్లాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆమె ధైర్యం, పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం వేంసూరు రోడ్డులోని దోబీఘాట్ లో పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఐలమ్మ వర్ధంతి వేడుకలో డాక్టర్ దయానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి డాక్టర్ దయానంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామెర రమేష్, బొంతు వేణు, సీపీఐ(ఎం) నాయకులు రావుల రాజబాబు కొలికపోగు సర్వేశ్వరరావు, జాజిరి జ్యోతి, తన్నీరు కృష్ణవేణి, సీపీఐ నాయకులు దండు ఆదినారాయణ, ఎల్ఐసీ రిటైర్డ్ డీవో శ్రీరాముల సారంగపాణి, రజక సంఘం అధ్యక్షులు విరివాడ నాగభూషణం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.



