– ఐదు మోర్చాలు, 12 జిల్లాల అధ్యక్షులు ఔట్
– పనిచేయని వారు, బండి గ్రూపు వారిపై వేటు!
– మిషన్ 90 విఫలంతో ప్రక్షాళన
– ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవటంపై ఫోకస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల వేళ రాష్ట్ర నాయకత్వాన్ని గ్రిప్‌లో పెట్టుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తన మార్క్‌ను ప్రదర్శించారు. ఐదు మోర్చాలకు, 12 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను మార్చేశారు. ఇప్పటికైతే మిగతా జిల్లాలకు పాతవారే కొనసాగనున్నారు. తొలుత కిసాన్‌మోర్చా అధ్యక్షులుగా పెద్దోళ్ల గంగారెడ్డి పేరును కూడా ప్రకటించారు. ఏమైందో ఏమోగానీ తర్వాత అతని పేరును జాబితా నుంచి తొలగించారు. కిసాన్, మైనార్టీ మోర్చా అధ్యక్షులను త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 ఎత్తుగడతో ముందుకెళ్లి బొక్కబోర్లా పడ్డ తర్వాత అధిష్టానం నుంచి అక్షింతలు పడ్డ సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ను హర్యానాకు పంపి కొత్తగా రాజస్థాన్‌కు చెందిన చంద్రశేఖర్‌ను తీసుకొచ్చిన సంగతి విదితమే. అట్లాగే రాష్ట్ర, జిల్లా కమిటీను ప్రక్షాళన చేసేందుకు జాతీయ నాయకత్వం కూడా గ్రీన్‌సిగల్ ఇవ్వడాన్ని కిషన్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రక్షాళన పేరుతో 12 జిల్లాల అధ్యక్షులను కొత్తగా నియమించారు. ఐదు మోర్చాలకు అధ్యక్షులనూ మార్చేశారు. అందులో పనిచేయని వారు, బండి గ్రూపు వారు ఉన్నట్టు, కొత్త నియమితులైన వారిలో తనకు అనుకూలురైన వారినే నియమించినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకే రాష్ట్ర నాయకత్వం మార్పులు, చేర్పులు చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు వీరే..
ఎస్టీ మోర్చా డాక్టర్ కల్యాణ్ నాయక్
ఎస్సీ మోర్చా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
యువ మొర్చా సేవెల్ల మహేందర్
ఓబీసీ మోర్చా ఆనంద్ గౌడ్
మహిళా మోర్చా డాక్టర్ మేకల శిల్ప
కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు వీరే..
నిజామాబాద్ దినేశ్ కుమార్ కులాచారి
పెద్దపల్లి చందుపట్ల సునీల్
సంగారెడ్డి గోదావరి అంజిరెడ్డి
సిద్దిపేట గంగడి మోహన్ రెడ్డి
యాదాద్రిభువనగిరి పాశం భాస్కర్
వనపర్తి డీ నారాయణ
వికారాబాద్ మాధవరెడ్డి
నల్లగొండ డాక్టర్ వర్షిత్ రెడ్డి
ములుగు బలరాం
మహబూబ్ నగర్ పీ శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ గంట రవి
నారాయణపేట జలంధర్ రెడ్డి